ఇంగ్లాండ్ టెస్టు సారథి జో రూట్ మరో ఘనత సాధించాడు. ఇటీవల టెస్టుల్లో తమ జట్టు తరఫున 8వేల పరుగులు చేసిన ఏడో బ్యాట్స్‌మన్‌గా నిలిచిన ఇతడు.. తాజాగా ఆ రికార్డులో అడుగు ముందుకు జరిగి మరో మైలురాయిని చేరుకున్నాడు. తమ జట్టు మాజీ ఓపెనర్ జెఫ్రీ బాయ్‌కాట్‌ను వెనక్కి నెట్టి టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఇంగ్లాండ్ ఆరో క్రికెటర్‌గా నిలిచాడు.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఈ ఫీట్‌ను అందుకున్నాడు రూట్. రూట్ ప్రస్తుతం టెస్టు క్రికెట్లో 8119 పరుగులు చేశాడు.
శ్రీలంకతో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 381 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్ 98/2 పరుగులు చేసి.. 283 పరుగుల వెనుకంజలో ఉంది. 67 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు రూట్. అతడికి టెస్టులో ఇది 50వ అర్ధశతకం. ఇప్పటివరకు 18 శతకాలు చేశాడు.
ఇంగ్లాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అగ్రస్థానంలో ఇంగ్లాండ్ మాజీ సారథి అలిస్టర్ కుక్(12,477) ఉండగా.. గ్రాహం గూచ్(8,900), అలెక్ స్టీవార్ట్(8,463), డేవిడ్ గోవర్(8,231), కెవిన్ పీటర్సన్(8,181) ఇలా వరుసగా తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.
ఇదీ చూడండి: రూట్ రికార్డు.. ఇంగ్లాండ్ ఏడో బ్యాట్స్‌మన్‌గా