బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ గెలవడంపై భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ తమలో ఆత్మవిశ్వాసం నింపాడని అన్నాడు. మ్యాచ్ మధ్యలో తమకు దిశానిర్దేశం చేస్తూ, వ్యూహాలను ప్రణాళిక బద్దంగా రచించాడని చెప్పాడు.
"మ్యాచ్ మధ్యలో మేం ఒత్తిడికి లోనయ్యాం. ఈ ఫార్మాట్లో ఏ జట్టునూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ వారు(బంగ్లాదేశ్) అద్భుతంగా ఆడారు. అయితే ఈ మ్యాచ్‌లో మాకు మంచి ఆరంభం దక్కింది. అయితే ఛేదనలో బంగ్లా బ్యాట్స్‌మెన్ పుంజుకోవడం మొదలు పెట్టారు. ఆ సమయంలో రోహిత్ శర్మ మాలో ఆత్మవిశ్వాసం నింపాడు" -శ్రేయస్ అయ్యర్, టీమిండియా క్రికెటర్.
జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సరైన సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడానని చెప్పాడు అయ్యర్.
"సరైన సమయంలోనే బ్యాట్ ఝుళిపించానని అనుకుంటున్నా. ఒకే ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టడం మా జట్టుకు కలిసొచ్చింది. లేకుంటే 150 లోపు స్కోరుకే పరిమితమయ్యే వాళ్లం. జట్టు విజయంలో నా పాత్ర ఉందని భావిస్తున్నా. 15వ ఓవర్ వరకు టాప్-3 బ్యాట్స్‌మెన్ ఒకరు క్రీజులో ఉండడం చాలా ముఖ్యం" - శ్రేయస్ అయ్యర్, టీమిండియా క్రికెటర్.