టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయం గురించి కోచ్ రవిశాస్త్రి మాట్లాడాడు. వైద్య నివేదిక పరిశీలించిన తర్వాతే ఆస్ట్రేలియా పర్యటన కోసం జట్టులోకి తీసుకోలేదని చెప్పారు. మరోసారి గాయపడితే మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
"రోహిత్ మెడికల్ రిపోర్ట్ పరిశీలించిన తర్వాతే జట్టును ప్రకటించాం. గాయం గురించి వైద్యులు చూసుకుంటారు. దానిపై మేం ఏం చేయలేం. రోహిత్ గాయంపై వైద్యబృందం సెలక్టర్లకు ఓ రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం రోహిత్ మరోసారి గాయపడితే మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఓ క్రీడాాకారుడికి చిరాకు కలిగించే విషయాల్లో గాయాలు కూడా భాగమే. దాని నుంచి ఎంత త్వరగా బయటపడాలన్న దాని గురించి ఆలోచించాలి. నాకూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. 1991లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లా. డాక్టర్లు చెప్పినట్లు విని ఆ సిరీస్కు వెళ్లకుండా ఉండి 3-4 నెలలు విరామం తీసుకుంటే మరో ఐదేళ్లు ఎక్కువగా ఆడేవాడిని. రోహిత్ కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాడు"