ఆస్ట్రేలియా పర్యటన కోసం ప్రకటించిన టీమ్ఇండియా జట్టుకు సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మను ఎంపిక కాలేదు. రోహిత్ గాయపడ్డాడని.. అతడి పరిస్థితిని పరిశీలిస్తున్నామని బీసీసీఐ తెలిపింది. టీమ్ఇండియా పర్యటనకు వెళ్లే సమయానికి కోలుకుంటే అతడు కూడా జట్టుతో వెళ్తాడని పేర్కొంది. అయితే వీరు చెప్పింది ఇలా ఉంటే రోహిత్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
ఏం జరుగుతోంది?
గాయం కారణంగా అతడు ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడని అంటోంది బీసీసీఐ. కానీ సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించగానే రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. అతడు కోలుకున్నాడని.. మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాడని ముంబయి ఇండియన్స్ ట్వీట్ చేసింది. దీంతో అభిమానులు గందరగోళంలో పడ్డారు. రోహిత్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తుంటే గాయం అయిందని బీసీసీఐ చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆస్ట్రేలియాతో టీ20, వన్డే, టెస్టు పర్యటన కోసం జట్లను ప్రకటించింది టీమ్ఇండియా సెలక్షన్ కమిటీ. మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఉండగా, టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్గా రహానే, వన్డే, టీ20లకు కేఎల్ రాహుల్కు అవకాశం కల్పించింది. అయితే ఎప్పటి నుంచో రోహిత్ పరిమిత ఓవర్ల జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.