ఐసీసీ పురస్కారాలపై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు. సంవత్సరాలుగా తప్పులెన్నో చేసి, అందరి దృష్టిలో పడ్డ తనకు స్ఫూర్తిదాయక క్రికెటర్ అవార్డు రావడం ఆశ్చర్యంగా అనిపించిందన్నాడు. ప్రపంచకప్‌లో అభిమానులు ఆసీస్ మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ను అవహేళన చేస్తుండగా విరాట్ అడ్డుకున్నాడు. చప్పట్లుకొట్టి ప్రోత్సహించాలని సూచించాడు. ఈ కారణంతో అతడిని ఈ పురస్కారం వరించింది. మూడేళ్ల క్రితం స్మిత్ 'బ్రెయిన్ ఫేడ్' వ్యవహారంతో వీరిద్దరి మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. వన్డే క్రికెటర్‌గా ఎంపికైన వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, అత్యుత్తమ టీ20 ప్రదర్శన చేసిన యువ పేసర్ దీపక్ చాహర్.. ఈ పురస్కారాలపై ఆనందం వ్యక్తం చేశారు.
అలా చేయడం తప్పు
"చాలా ఏళ్లు తప్పులెన్నో చేసి అందరి దృష్టిలో పడ్డాను. ఇప్పుడీ పురస్కారం రావడం ఆశ్చర్యంగా ఉంది. ఇతరులపై క్రీడాకారులకు సోదరభావం ఉండాలి. వ్యక్తిగత పరిస్థితుల వల్లే ఆ ఘటన జరిగింది. అందునుంచి బయటపడి వచ్చిన వ్యక్తిపై స్లెడ్జింగ్ లేదా కవ్వించో ప్రయోజనం పొందాలని ప్రత్యర్థులు భావిస్తారు. అంతవరకు ఫర్వాలేదు కానీ అవహేళన చేయడం మాత్రం క్రీడాస్ఫూర్తిలో భాగమవ్వదు. నేను అది అంగీకరించను. ఒక క్రికెటింగ్ దేశంగా మా అభిమానులు దానిని ప్రతిబింబించొద్దు. ఆ బాధ్యతనంతా మేం తీసుకోవాలి. ప్రత్యర్థిపై పైచేయి సాధించాలనుకోవడం సరైందే. ఎవరో ఒకర్ని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకొని భావోద్వేగానికి గురిచేయడం మాత్రం తప్పు. ఏ స్థాయిలోనూ అది అంగీకారయోగ్యం కాదు" -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్