ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 కోసం ఉత్సాహంగా అబుదాబిలో అడుగుపెట్టిన ముంబయి ఇండియన్స్‌కు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. అక్కడికి చేరుకుని ఆరు రోజులు గడిచినా మరో వారం రోజులు క్వారంటైన్‌లోనే ఉండాల్సి వస్తోంది. ఎందుకంటే దుబాయ్, షార్జాతో పోలిస్తే అబుదాబిలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. అక్కడి నిబంధనలు కూడా వేరుగా ఉన్నాయి. దాంతో ఆ జట్టు సభ్యులు మళ్లీ తమ గదులకే పరిమితం అయ్యారు.
ఇతర ఆటగాళ్లకు ఇబ్బందిగా అనిపిస్తున్నా ముంబయి సారథి రోహిత్ శర్మ మాత్రం తన క్వారంటైన్ సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఎందుకంటే అతడు తన భార్య రితికా సజ్దే, కుమార్తె సమైరాతో కలిసి వచ్చాడు. కాగా తన ముద్దుల కుమార్తెకు రాక్షస బల్లుల్ని పరిచయం చేశామని హిట్‌మ్యాన్ చెప్పాడు. అయితే ఆమె రెండు నిమిషాలు మాత్రమే వాటిని చూసిందని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు.