తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రోహిత్​ శర్మ' బ్యాట్​ అద్భుతం చేసింది - రోహిత్ శర్మ భారత ఓపెనర్

భారత క్రికెట్ జట్టు ఓపెనర్ రోహిత్​శర్మ.. ఈ ఏడాది అద్భుతం చేశాడు. ఫార్మాట్​ ఏదైనా సరే తన బ్యాటుతో బీభత్సం సృష్టించాడు. పలు రికార్డులు నెలకొల్పడం సహా ఈ ఏడాది ప్రపంచ టాప్​ స్కోరర్​గా నిలిచాడు.

'రోహిత్​ శర్మ' బ్యాట్​ అద్భుతం చేసింది
భారత క్రికెట్ జట్టు ఓపెనర్ రోహిత్​శర్మ

By

Published : Dec 26, 2019, 8:42 AM IST

చాలా ఏళ్లుగా చూస్తున్న సంగతే. ఏడాది చివరికి వచ్చేసరికి భారత క్రికెట్‌ జట్టులో ఎవరి ప్రదర్శన ఎలా ఉందని సమీక్షించి చూసుకుంటే.. కోహ్లి ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాడు! క్రికెట్‌ చరిత్రలోనే ఎన్నడూ చూడని నిలకడతో, రికార్డులతో ఔరా అనిపించడం కోహ్లికి అలవాటైపోయింది. ఈ ఏడాది అతనేమీ తక్కువగా ఆడలేదు. అయినా సరే.. ఈ ఏడాది రోహిత్‌ శర్మదే! కోహ్లీని మించిన నిలకడతో, రికార్డులతో 2019 తనదే అని చాటి చెప్పాడీ సొగసరి ఓపెనర్‌.

భారత ఓపెనర్ రోహిత్​శర్మ

అంతర్జాతీయ క్రికెట్లో చూసినా.. ఐపీఎల్‌లో చూసినా.. టెస్టుల్లో అయినా వన్డేల్లో అయినా.. ప్రపంచకప్‌ తీసుకున్నా.. ఏ ద్వైపాక్షిక సిరీస్‌ను ఎంచుకున్నా.. హిట్‌మ్యాన్‌ పరుగుల జోరు మామూలుగా లేదు ఈ ఏడాది. రోహిత్‌ కెరీర్లో '2019' చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహమే లేదు.

భారత క్రికెటర్లు పోటీ పడటానికి, స్ఫూర్తి పొందడానికి ప్రపంచం వైపు చూడాల్సిన పనేమీ లేదు. రిటైరైన మన దిగ్గజాల్నీ తలుచుకోవాల్సిన పనీ లేదు. ప్రస్తుత జట్టు సారథి కోహ్లీనే.. నన్ను అందుకుని చూడండంటూ సవాలు విసురుతాడు సహచరులకు. ఏడాది ముగిసేసరికి అతడికి సమీపంలో నిలిచినా గొప్ప ఘనతగా భావించాల్సిందే. విరాట్‌కు ఏ ఫార్మాట్‌ అనేది లెక్క ఉండదు. ఎందులోనైనా అతడు కింగే. వన్డేల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. విరాట్ గణాంకాలు చూస్తే దిమ్మదిరిగిపోతుంది. సచిన్‌ సహా వన్డే క్రికెట్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని పరుగుల ప్రవాహం, రికార్డుల మోత అతడిది. ఈ ఏడాది మాత్రం అతడు.. రోహిత్‌ వెనక్కి వెళ్లిపోయాడు.

టీమిండియా ఓపెనర్ రోహిత్​శర్మ

ఈ ఏడాది 26 వన్డేల్లో కోహ్లీ.. 1377 పరుగులు సాధిస్తే.. అతడి కంటే 2 మ్యాచ్‌లు ఎక్కువ ఆడిన రోహిత్‌.. 1490 పరుగులు చేయడం విశేషం. 2019లో మొత్తం ప్రపంచ క్రికెట్లో అతడిదే అగ్రస్థానం. టీ20ల్లో విరాట్‌కు దీటుగా నిలిచిన రోహిత్‌.. ఆశ్చర్యకరంగా టెస్టుల్లోనూ అతణ్ని మించే ప్రదర్శన చేశాడు. విరాట్‌ 8 టెస్టులాడి 68 సగటుతో 612 పరుగులు చేస్తే.. రోహిత్‌ 5 మ్యాచ్‌ల్లోనే 92.66 సగటుతో 556 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌ సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ఈ ఏడాది జట్టును ముందుండి నడిపిస్తూ మరో కప్పు అందించాడు రోహిత్‌. విరాట్‌ ఒక్కడితో పోల్చి చూస్తే చాలు.. రోహితే ఈ ఏటి మేటి బ్యాట్స్‌మన్‌ అని చెప్పడానికి.
ఆ లోటూ తీరిపోయింది

టీమిండియా ఓపెనర్ రోహిత్​శర్మ

2019 రోహిత్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే సంవత్సరంగా మారడానికి అన్నిటికంటే ముఖ్యమైన కారణం.. అతను టెస్టుల్లోనూ తనదైన ముద్ర వేయడం. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎన్ని ఘనతలు సాధించినా.. టెస్టుల్లో సత్తా చాటకపోతే ఏ క్రికెటర్‌ కెరీర్‌ పరిపూర్ణం కాదు. వన్డేలు, టీ20ల్లో ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్‌గా పేరు సంపాదించినప్పటికీ.. టెస్టు జట్టులో తన స్థానాన్ని నిలుపుకోలేని స్థితి రోహిత్‌ది. మిడిలార్డర్లో ఎన్నో అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఒక దశలో టెస్టు కెరీర్‌పై రోహిత్‌ ఆశలు వదులుకున్నట్లే కనిపించింది. అయితే కొన్ని నెలల కిందట దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో రోహిత్‌ను ఓపెనర్‌గా ప్రయోగించి చూసింది టీమిండియా. టెస్టుల్లో అతడికిది చివరి అవకాశంగా భావించారందరూ. అతడు దీన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ బాదేశాడు. ఇదే సిరీస్‌లో డబుల్‌ సెంచరీ అందుకున్నాడు.

ఆరంభిస్తే.. ఆగడు

రోహిత్‌ స్వతహాగా ఓపెనర్‌ కాదు. కెరీర్‌ ఆరంభంలో మిడిలార్డర్లోనే ఆడాడు. అనుకున్నంతగా రాణించలేదు. 2007 టీ20 ప్రపంచకప్‌తో కెరీర్‌ ఆరంభించిన 'హిట్‌ మ్యాన్‌'.. 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీతో ఓపెనరయ్యాడు. అప్పట్నుంచి వన్డేలు, టీ20ల్లో ఓపెనర్‌గా కొనసాగుతున్నాడు. ఓపెనర్‌గా, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ గణాంకాలకు పోలికే లేదు. టెస్టుల్లోనూ ఇటీవలే ఓపెనర్​గా మారాక ఎలా దూసుకెళ్తున్నాడో తెలిసిందే.

భారత క్రికెట్ జట్టు ఓపెనర్ రోహిత్​శర్మ

చరిత్రలో చూడని ప్రవాహం

రోహిత్‌ వన్డే కెరీర్లో మిగతా మెరుపులన్నీ ఒకెత్తయితే.. ఈ ఏడాది ప్రపంచకప్‌లో అతడి పరుగుల ప్రవాహం మరో ఎత్తు. ఈ టోర్నీలో అతను మొత్తంగా ఆడింది 8 మ్యాచ్‌లే. వాటిలోనే ఏకంగా అయిదు శతకాలు బాదేశాడు. ప్రపంచకప్‌ చరిత్రలోనే ఒక టోర్నీలో మరే ఆటగాడూ ఇన్ని శతకాలు సాధించలేదు. భవిష్యత్తులోనూ ఈ రికార్డు బద్దలవడం సందేహమే. సచిన్‌ ఆరు ప్రపంచకప్‌ల్లో ఆరు శతకాలతో రికార్డు నెలకొల్పితే.. రోహిత్‌ రెండు కప్పుల్లోనే దాన్ని సమం చేశాడు. ఈ ఏడాది ఒక్క టోర్నీలోనే అయిదు సెంచరీలు కొట్టడం అద్భుతమే. ఇలా రోహిత్‌ 2019 హీరోగా నిలిచాడు.

ఏడేళ్లుగా అతడే

గత ఏడేళ్లలో రోహిత్ వన్డే పరుగులు

శతకం సాధించగానే ఇక చాలన్నట్లుగా చాలామంది బ్యాట్స్‌మెన్‌ తేలిక పడిపోతారు. కానీ రోహిత్‌ శర్మ మాత్రం ఇందుకు భిన్నం. సెంచరీ అవ్వగానే కొత్తగా ఇన్నింగ్స్‌ మొదలుపెట్టినట్లుగా ఆడతాడు. అప్పటిదాకా ఓ మోస్తరు వేగంతో ఆడే రోహిత్‌.. ఉన్నట్లుండి విధ్వంసక రూపంలోకి మారిపోతాడు. ఆ ఊపు చూస్తే అందరికీ డబుల్‌ సెంచరీ మీదికి దృష్టిమళ్లుతుంది. వన్డే క్రికెట్‌ చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన రోహిత్‌.. ఇంకో అయిదుసార్లు 150, అంతకంటే ఎక్కువ స్కోర్లు సాధించడం విశేషం. ఇంకో పెద్ద విశేషం ఏంటంటే.. 2013 నుంచి ఈ ఏడాది వరకు ప్రతి ఏటా భారత్‌ తరఫున వన్డేల్లో టాప్‌స్కోరర్‌గా నిలుస్తున్నది రోహితే. వన్డేల్లో తిరుగులేని రికార్డున్న కోహ్లిని వెనక్కి నెట్టి ఏడేళ్లుగా ప్రతిసారీ రోహితే టాప్‌స్కోరర్‌గా నిలుస్తుండటం ఆశ్చర్యమే.

అక్కడా కొడితే

రోహిత్‌.. ఈ ఏడాది చాలానే సాధించాడు. టెస్టుల్లోనూ తనేంటో రుజువు చేసుకున్నాడు. ప్రస్తుతం అతడి కెరీర్‌ పతాక స్థాయిని చూస్తున్నాం. అయితే రోహిత్‌ ఎంత సాధించినా.. విదేశాల్లో ఫాస్ట్‌ పిచ్‌లపై, ముఖ్యంగా టెస్టుల్లో నిలబడలేడన్న విమర్శలున్నాయి. టెస్టుల్లో అతడి స్థానం సుస్థిరం కాకపోవడానికి కూడా ఇదే ముఖ్య కారణం. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో రోహిత్‌ టెస్టుల్లో తడబడ్డాడు. ఈ దేశాలన్నింట్లో రోహిత్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ వరకు ఢోకా లేదు. టెస్టుల్లోనే లెక్కలు సరి చేయాలి. ఇటీవల ఓపెనర్‌గా స్వదేశీ టెస్టుల్లో చెలరేగి ఆడేసిన హిట్‌ మ్యాన్‌.. విదేశీ ఫాస్ట్‌ పిచ్‌లపైనా నిలకడగా రాణిస్తే.. అతడిని ప్రపంచం పరిపూర్ణ బ్యాట్స్‌మన్‌గా గుర్తిస్తుంది. మరి అతనేం చేస్తాడో చూడాలి.
ఈ ఏడాదే టెస్టుల్లో ఓపెనర్‌ అవతారమెత్తిన రోహిత్‌.. తొలి మ్యాచ్‌లోనే (దక్షిణాఫ్రికాపై) సెంచరీ సాధించాడు. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఓపెనర్‌ పాత్రలోకి మారిన తొలి సిరీస్‌లోనే అతను డబుల్‌ సెంచరీ (212) కొట్టాడు.

ఎన్నెన్ని ఘనతలో

2019లో రోహిత్ శర్మ గణాంకాలు
  • ఈ ఏడాది వన్డేల్లో రోహిత్‌ పరుగులు 1490. అతడే ప్రపంచ టాప్‌స్కోరర్‌.
  • 2019 ప్రపంచకప్‌లో రోహిత్‌ బాదిన శతకాలు 5. ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీల రికార్డు అతడిదే.
  • ఈ ఏడాది ప్రపంచకప్‌లో రోహిత్‌ పరుగులు 648. టోర్నీ టాప్‌స్కోరర్‌ అతడే. ఇంకో 26 పరుగులు చేస్తే సచిన్‌ (2003లో 673)ను అధిగమించి టోర్నీ చరిత్రలోనే ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచేవాడు.
  • ఒక ఏడాదిలో అత్యధిక వన్డే శతకాలు బాదిన ఆటగాళ్లలో సచిన్‌ (1999లో 9) తర్వాతి స్థానానికి రోహిత్‌ చేరుకున్నాడు. అతను ఈ ఏడాది 7 సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో సాధించిన 3తో కలిపి మొత్తం 2019లో అతడి శతకాల సంఖ్య 10.
    రోహిత్​శర్మ కుటుంబం

ABOUT THE AUTHOR

...view details