కరోనా వైరస్ కారణంగా దాదాపు నాలుగు నెలల నుంచి ఆటలన్నీ నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే పలు క్రీడలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య బయోసెక్యూర్ విధానంలో మూడు టెస్టుల సిరీస్ బుధవారం ప్రారంభమైంది. 117 రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ తిరిగి మొదలవడంపై పలువురు మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు సంబరపడ్డారు.
అక్కడికి వెళ్లకుండా ఉండలేకపోతున్నా: రోహిత్ శర్మ - ఇంగ్లాండ్ వెస్టిండీస్ టెస్టు మ్యాచ్
క్రికెట్ మ్యాచ్‌లు మళ్లీ మొదలుకావడంపై హర్షం వ్యక్తం చేసిన టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ.. ఇంగ్లాండ్-వెస్టిండీస్ మ్యాచ్‌కు వెళ్లకుండా ఉండలేకపోతున్నానని ట్వీట్ చేశాడు.
సౌథాంప్టన్ వేదికగా ఇరు జట్ల మధ్య నిన్న తొలి టెస్టు ఆరంభమవ్వగా ఇంగ్లిష్ జట్టు తాత్కాలిక కెప్టెన్ బెన్‌స్టోక్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచకున్నాడు. అయితే, విండీస్ పేసర్ గాబ్రియల్ రెండో ఓవర్‌లోనే ఇంగ్లాండ్ ఓపెనర్ డామ్ సిబ్లీ(0)ని బౌల్డ్ చేశాడు. దీంతో ఆతిథ్య జట్టు పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో తొలిరోజు పదేపదే వర్షం అంతరాయం కలిగించడం వల్ల 17.4 ఓవర్ల పాటే ఆట జరిగింది. 35/1తో నిలిచింది ఆతిథ్య ఇంగ్లాండ్. బర్న్స్(20), డెన్లీ(14) క్రీజులో ఉన్నారు.
ఇన్ని రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ తిరిగి ప్రారంభం కావడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌గంగూలీ, క్రికెటర్లు రోహిత్ శర్మ, అశ్విన్, మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్, షేన్‌వార్న్‌తో పాటు పలువురు ఆటగాళ్లు హర్షం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా స్పందించారు. గంగూలీ బుధవారం మాట్లాడుతూ ఇంగ్లాండ్-వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్టును చూసి ఆస్వాదిస్తున్నానని చెప్పాడు.
- క్రికెట్ మళ్లీ ప్రారంభమైంది. ఇంగ్లాండ్‌లో సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు క్రికెట్ మొదలవడం చూస్తుంటే చాలా బాగుంది. ఇరు జట్లకు అభినందనలు. నేను అక్కడికి వెళ్లకుండా ఉండలేకపోతున్నా. -రోహిత్‌శర్మ
- ఇకపై ఏం జరిగినా క్రికెట్ ఆటే విజేత. ఈ వ్యాఖ్య ఇంతకుముందు ఎన్నో సార్లు అని ఉంటారు. కానీ, ఈ రోజు మాత్రం పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. రెండు జట్లకు గుడ్‌లక్. -అశ్విన్
- అంతర్జాతీయ క్రికెట్ పునఃప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉంది. -షేన్‌వార్న్
- టెస్టు క్రికెట్ మళ్లీ మొదలవడం ఎంతో బాగుంది. -రికీ పాంటింగ్
- 117 రోజుల తర్వాత అంతర్జాతీయ టెస్టు క్రికెట్ ప్రారంభం. 21వ శతాబ్ధంలో ఎక్కువ కాలం ఎదురు చూడటం అంటే ఇదే. ఇంగ్లాండ్-వెస్టిండీస్ తొలి టెస్టుకు వాతావారణం అనుకూలించాలి. - సుబ్రమణ్యం బద్రీనాథ్