టీమిండియా ఓపెనర్ రోహిత్‌శర్మ... బంగ్లాతో టీ20 సిరీస్ ముందు పొట్టిఫార్మాట్లో జట్టు ర్యాంకు గురించి స్పందించాడు. టీ20ల్లో భారత్ మరింత రాణించాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ 5వ స్థానంలో ఉందని చెప్పాడు.మూడు ఫార్మాట్లలో భారత జట్టు టాప్-1లో ఉండాలన్నదే తన ధ్యేయమని అన్నాడు హిట్‌మ్యాన్.
రేపటి(నవంబర్ 3) నుంచి బంగ్లా-భారత్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. టీమిండియాకు సారథిగా రోహిత్ వ్యవహరించనున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన క్రికెటర్... వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ నాటికి ర్యాంకింగ్స్‌లో భారత్ మెరుగుపడాలని అన్నాడు.
"గత మ్యాచ్‌ల ఫలితాల విశ్లేషణల ఆధారంగా లక్ష్యాలను ఛేదించడంలో టీమిండియా ప్రదర్శన బాగానే ఉంది. కాని భారీ లక్ష్యం ఇవ్వడంలో కాస్త వెనకబడి ఉన్నాం. ఎక్కువ టార్గెట్ ఇచ్చి ప్రత్యర్థిని తక్కువ పరుగులకు కట్టడి చేయడంపై దృష్టిపెట్టాం. ఇటీవల దక్షిణాఫ్రికాపై బెంగళూరులో జరిగిన టీ20లో తొలుత బ్యాటింగ్ చేశాం. కానీ పెద్దగా రాణించలేకపోయాం. వచ్చే ఏడాది ప్రపంచకప్ నాటికి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని బలమైన జట్టుగా తయారవ్వాలని భావిస్తున్నాం".
-రోహిత్‌శర్మ, టీమిండియా క్రికెటర్
ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను డ్రా చేసుకుంది టీమిండియా. కచ్చితంగా గెలవాల్సిన చివరి మ్యాచ్‌లో సరైన లక్ష్యం ఇవ్వలేకపోయింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లకు 134 పరుగులకే పరిమితమైంది కోహ్లీసేన. లక్ష్యాన్ని 16.5 ఓవర్లలోనే ఛేదించింది సఫారీ జట్టు.
2018-19 సీజన్లో విండీస్ జట్టును మాత్రమే ఓడించిన భారత్... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. కాబట్టి వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ నాటికి పొట్టి ఫార్మాట్లో మెరుగవ్వాలనేది రోహిత్ అభిప్రాయం. బంగ్లాతో సిరీస్‌కు కోహ్లీకు విశ్రాంతినిచ్చింది యాజమాన్యం.