భారత క్రికెట్ ప్రస్థానంలో రోహిత్‌శర్మ నెలకొల్పిన మైలురాళ్లకు కొదువేలేదు. ప్రపంచ క్రికెట్‌లోనే ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకాని విధంగా వన్డేల్లో మూడు ద్విశతకాలు బాదిన ఏకైక క్రికెటర్ ఇతడే. 50ఓవర్ల ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా వంటి మేటి జట్టుపై తొలిసారి ద్విశతకం బాదిన అతడు... శ్రీలంకపై రెండుసార్లు డబుల్ సెంచరీలు సాధించాడు.
అతడు తొలిసారి బాదిన ద్విశతకానికి నేటికి ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ నాటి మ్యాచ్‌లో 'హిట్‌మ్యాన్' ఎలా చెలరేగాడో ఓ సారి గుర్తు చేసుకుందాం.
మ్యాచ్ సాగిందిలా...
2013 ఆసీస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆఖరి వన్డే అది. టాస్ గెలిచిన ఆస్టేలియా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా ఓపెనర్ రోహిత్‌శర్మ(209; 158 బంతుల్లో 12x4, 16x6) ... సిక్సర్ల మోత మోగిస్తూ కెరీర్లో తొలి డబుల్ సాధించాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ మూడో బంతికి మెక్కే బౌలింగ్‌లో భారీషాట్ ఆడబోయిన రోహిత్... హెన్రిక్స్ చేతికి చిక్కాడు. ఫలితంగా తొలి డబుల్ సెంచరీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
హిట్‌మ్యాన్‌కు తోడుగా మరో ఓపెనర్ శిఖర్‌ధావన్(60; 57 బంతుల్లో 9x4) మంచి సహకారం అందించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్(0), రైనా(28), యువీ(12) నిరాశపర్చగా.. ధోనీ (62; 38 బంతుల్లో 7x4, 2x6) రాణించాడు. ఫలితంగా.. టీమిండియా నిర్ణీత ఓవర్లలో 383/6 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ తడబడి ఓటమిపాలైంది. ఫాల్క్‌నర్(116) పోరాడినా ఇతరుల నుంచి సహకారం లభించకపోవడం వల్ల ఆసీస్ 326 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో 7 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది భారత జట్టు. రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' రోహిత్‌కే దక్కింది.
రోహిత్‌శర్మ... ఈ ఇన్నింగ్స్ తర్వాత ఈడెన్స్ గార్డెన్స్ వేదికగా 2014 నవంబర్ 13న శ్రీలంకతో జరిగిన వన్డేలో 264 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లోనూఇప్పటివరకు ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. అనంతరం 2017 డిసెంబర్ 13న లంకేయులపైనే మొహలీ మ్యాచ్‌లో మరోసారి డబుల్ సెంచరీ (208) చేశాడు. మొత్తం ఎనిమిదిసార్లు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ద్విశతకాలు నమోదు కాగా... అందులో రోహిత్ చేసినవే మూడు ఉన్నాయి.