తెలంగాణ

telangana

ETV Bharat / sports

రో'హిట్​'.. ఈ ఏడాది సూపర్ హిట్​ - 2019 Rohit Sharma

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ.. ఈ ఏడాది జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా పరుగుల దాహంతో దూసుకెళ్తున్నాడు. వన్డే, టెస్టుల్లో కలిపి 10 శతకాలు చేశాడు. ఐపీఎల్-2019​లో ముంబయి ఇండియన్స్​ను విజేతగా నిలిపి, ఈ ఏడాదిని రోహిత్ నామ సంవత్సరంగా లిఖించుకున్నాడు.

Rohit Full Josh in 2019 Year and Break Records
రోహిత్ శర్మ

By

Published : Dec 22, 2019, 11:54 AM IST

ఈ ఏడాది.. టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ జోరు అంతా ఇంతా కాదు. వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌ ప్లేయర్‌గా హిట్‌మ్యాన్‌ హవా సాగింది. కూతురు పుట్టిన శుభవేళ ఏడాదంతా రోహిత్‌ నామ సంవత్సరంగా మారింది. ఆస్ట్రేలియా పర్యటనలో మొదలైన శతకాల దాహం.. వన్డే ప్రపంచకప్‌లో హోరెత్తి, టెస్టుల్లో మైమరపించి, వెస్టిండీస్‌తో ఘనంగా ముగించే దశకు చేరింది. ఈ నేపథ్యంలో ఏడాది మొత్తం పది శతకాలు బాదిన హిట్‌మ్యాన్‌ వన్డేల్లో 7.. టెస్టుల్లో 3 సాధించాడు. ఇక ఐపీఎల్‌ చరిత్రలో అత్యధికంగా నాలుగుసార్లు టైటిల్‌ సాధించిన జట్టుగా ముంబయి ఇండియన్స్‌ను అగ్రస్థానంలో నిలిపాడు.

కూతురు పుట్టిన శుభవేళ..

రోహిత్‌ సతీమణి రితిక.. గతేడాది డిసెంబర్‌ 31న పాపకు జన్మనిచ్చింది. ఆ సమయంలో ఆసీస్‌ పర్యటనలో ఉన్న రోహిత్‌.. విషయం తెలియగానే ముంబయి చేరుకున్నాడు. జనవరి 6న తన గారాలపట్టి పేరు 'సమైర' అని ట్విటర్‌లో వెల్లడించాడు. మూడు రోజుల్లోనే మళ్లీ ఆస్ట్రేలియాకు బయలుదేరిన రోహిత్‌.. సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో శతకంతో కదంతొక్కాడు. కూతురు పుట్టిన శుభ సందర్భం తర్వాత తొలి మ్యాచ్‌లోనే శతకం బాది ఈ ఏడాదంతా అలరిస్తానని హెచ్చరికలు జారీ చేశాడు. అప్పటి నుంచి మొదలైన హిట్‌మ్యాన్‌ హవా తాజాగా జరుగుతున్న వెస్టిండీస్ సిరీస్‌ వరకు కొనసాగింది.

కూతురు పుట్టిన శుభవేళ..

ముంబయి విజేత.. రోహిత్‌ చరిత్ర..

ఈ ఏడాది ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్‌ను విజేతగా నిలి‌పాడు రోహిత్​ శర్మ. నాలుగోసారి టైటిల్​ సాధించాడు. 14 మ్యాచ్‌ల్లో 405 పరుగులు చేశాడు. ముంబయి ఇండియన్స్‌ తరఫున అత్యధిక పరుగులు చేసినమూడో బ్యాట్స్​మన్​గా నిలిచాడు. తనదైన వ్యూహాలతో ప్రత్యర్థులను మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆఖరి సమరం. అప్పటికే ఇరు జట్లు చెరో మూడుసార్లు టైటిల్‌ సాధించి ఉన్నాయి. ఈసారి ఎవరు గెలిస్తే వారు చరిత్ర సృష్టిస్తారు. 2018లో ధోనీ.. మూడోసారి ఆ కప్పు గెలిచి జోరుమీదున్నాడు. ఇక అంతా చెన్నై గెలుస్తుందనే భావనలో ఉన్నారు. ఇలాంటి ఉత్కంఠ పరిస్థితుల నడుమ జరిగిన తుదిపోరులో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ముంబయి విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసి 149 పరుగుల మోస్తరు స్కోరు చేసినా ధోనీసేనను ఢీకొంది. తేలికపాటి స్కోరును సైతం అద్భుత కెప్టెన్సీతో గెలిపించాడు రోహిత్‌. చివరి ఓవర్‌లో మలింగకు బౌలింగ్‌ ఇచ్చి ఒక్క పరుగు తేడాతో ముంబయిని గెలిపించాడు.

ముంబయి విజేత.. రోహిత్‌ చరిత్ర..

ప్రపంచకప్‌లో శతకాల హోరు

ఐపీఎల్‌ తర్వాత ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అయినప్పటికీ సెమీస్​తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మెగా ఈవెంట్‌లో కెరీర్‌ అత్యుత్తమ ఫామ్‌ కొనసాగించిన హిట్‌మ్యాన్‌.. ఐదు శతకాలతో విశ్వరూపం చూపించాడు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్​మన్​గా చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో నాలుగు అత్యధిక శతకాలు చేసిన కుమార సంగక్కరను వెనక్కినెట్టి తనముద్ర వేశాడు.

టీమిండియా.. దక్షిణాఫ్రికాతో ఆడిన తొలి మ్యాచ్‌తో ప్రారంభమైన శతకాల హోరు తర్వాత పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లపై జోరుగా సాగింది. కివీస్‌తో జరిగిన సెమీస్‌లో రోహిత్‌ బ్యాట్‌ ఝుళిపించి ఉంటే భారత్‌ మరోసారి ఫైనల్‌ చేరేదేమో.

ప్రపంచకప్‌లో శతకాల హోరు..

టెస్టుల్లో ఓపెనర్‌గా దుమ్మురేపాడు

ప్రపంచకప్‌ తర్వాత టీమిండియా.. వెస్టిండీస్‌ పర్యటనను క్లీన్‌స్వీప్‌ చేసింది. అనంతరం దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో రోహిత్‌ ఓపెనర్‌గా దిగి అదరగొట్టాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా దిగడం అతడికి బాగా కలిసొచ్చింది. ఈ సిరీస్‌కు ముందు హిట్‌మ్యాన్‌ టెస్టుల్లో రాణించలేకపోయాడు. సఫారీలతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు బాదాడు. తర్వాత మూడో టెస్టులో ఏకంగా ద్విశతకంతో రప్ఫాడించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో విఫలమయ్యే సమస్యను సైతం అధిగమించాడు. తర్వాత బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో ఆకట్టుకోకపోయినా.. ప్రస్తుత వెస్టిండీస్‌ వన్డే సిరీస్‌లో మరోసారి మెరిశాడు. అచ్చొచ్చిన విశాఖపట్నం స్టేడియంలో రెండో వన్డేలో భారీ శతకం (159) బాది టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆదివారం జరిగే నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌.. ఈ ఏడాదిలో టీమిండియాకు చివరి పోరు. దీంతో ఈ ఏడాది ఆఖరిపోరులో ఎలా ఆడతాడనేది ఆసక్తిగా మారింది.

టెస్టుల్లో ఓపెనర్‌గా దుమ్మురేపాడు..

ఏడాదికి రూ.75 కోట్లకు పైగా ఆదాయం?

రోహిత్‌ ప్రస్తుతం ఇరవైకి పైగా వ్యాపార ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. ప్రపంచకప్‌లో ఐదు శతకాలతో చెలరేగడంతో కార్పొరేట్‌ సెక్టార్‌లో అతని విలువ అమాంతం పెరిగింది. ఏడాదికి సుమారు రూ.75 కోట్లకుపైనే సంపాదిస్తాడని మార్కెట్‌ విశ్లేషకుల అంచనా. ఆయా బ్రాండ్‌ వస్తువులకు యాడ్‌ షూటింగ్‌లో పాల్గొనాలంటే రోజుకు కనీసం రూ.ఒక కోటి తీసుకుంటాడని సమాచారం. సియట్‌ టైర్స్‌, అడిడాస్‌, హుబ్లట్‌ వాచెస్‌, రెలీస్ప్రే, రస్నా, ట్రుసాక్స్‌, షార్ప్‌ ఎలక్ట్రానిక్స్‌, డ్రీమ్‌ 11, న్యూ ఎరా తదితర బ్రాండ్లు అతని ఖాతాలో ఉన్నాయి. ఇటీవల టెస్టుల్లో ఓపెనర్‌గా రాణిస్తుండడంతో త్వరలోనే మరిన్ని బ్రాండ్లకు సంతకం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఎలా చూసినా ఈ ఏడాది రోహిత్‌ నామ సంవత్సరంగా మారిపోయింది.

ఏడాదికి రూ.75 కోట్లకు పైగా ఆదాయం?

ఇదీ చదవండి: కోహ్లీ: 2 మ్యాచ్​లు.. 4 పరుగులు.. 5 బంతులు

ABOUT THE AUTHOR

...view details