టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ విషయంపై బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేసింది. శుక్రవారం ఎన్‌సీఏలో నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో రోహిత్ పాసయ్యాడని వెల్లడించింది. ఫలితంగా రోహిత్ ఆస్ట్రేలియాకు బయల్దేరి వెళ్తాడని తెలిపింది. అక్కడ 14 రోజుల క్వారంటైన్ తర్వాత జట్టు సభ్యులతో కలుస్తాడని చెప్పింది.
రోహిత్ శర్మ ఫిట్.. కానీ: బీసీసీఐ - ఆస్ట్రేలియాకు రోహిత్ శర్మ
టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ తిరిగి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలిపింది బీసీసీఐ. త్వరలోనే అతడు ఆస్ట్రేలియా బయలుదేరుతాడని వెల్లడించింది. అక్కడ 14 రోజుల క్వారంటైన్ ముగిశాక జట్టుతో కలుస్తాడని చెప్పింది.
"బ్యాటింగ్ స్కిల్స్, ఫీల్డింగ్, వికెట్ల మధ్య పరిగెత్తడం.. తదితర అంశాల్లో రోహిత్‌ను పరీక్షించాం. అతడి ఫిజికల్ ఫిట్‌నెస్ సంతృప్తికరంగా ఉంది. కానీ అతడింకా శ్రమించాల్సి ఉంటుంది. క్వారంటైన్లో ఉండబోయే 14 రోజులపాటు రోహిత్ ఏం చేయాలనేది బీసీసీఐ మెడికల్ టీమ్ చూసుకుంటుంది. క్వారంటైన్ ముగిసిన తర్వాత రోహిత్‌ను తిరిగి పరీక్షిస్తారు. అప్పుడు కూడా ఫిట్‌గా ఉన్నాడని తేలితేనే టెస్టు జట్టులోకి అతడిని తీసుకుంటారు" అని తెలిపింది బీసీసీఐ.
ఐపీఎల్ 13వ సీజన్‌లో రోహిత్ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఆ కారణంగానే లీగ్ స్టేజ్‌లో పలు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అదే సమయంలో బీసీసీఐ.. ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి మూడు జట్లను ప్రకటించగా అందులో రోహిత్ పేరు లేదు. అనంతరం రోహిత్ ప్లేఆఫ్స్, ఫైనల్స్‌లో ఆడి ముంబయి జట్టును ఐదోసారి విజేతగా నిలిపాడు.