అతడు బ్యాట్ ఝుళిపిస్తే ప్రత్యర్థి ఓటమి ఒప్పుకోవాల్సిందే. అతడు కొట్టే సిక్సులకు బౌండరీల హద్దులు చెరిగిపోవాల్సిందే. అందుకే అతడి ఖాతాలో లెక్కలేనన్ని విజయాలు. ఓపెనింగ్‌లో అతడు ఆడితే టీమిండియాకు భరోసా. సొగసైన షాట్లు.. ఆడితే అవతలి ఆటగాళ్ల గుండెల్లో గుబులు పుట్టించగలిగే నైజం. అతడే టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ. నేడు (ఏప్రిల్ 30) 32వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా క్రికెటర్లు, అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
1987లో ఏప్రిల్ 30న మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పుట్టాడీ డాషింగ్ బ్యాట్స్‌మెన్. 2015లో రితికను వివాహం చేసుకున్నాడు రోహిత్. వీరిద్దరికీ సమైరా అనే కూతురు ఉంది.
రికార్డుల రారాజు...
వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు... అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. టెస్టు, వన్డే, టీ20 ఇలా అన్ని ఫార్మాట్లలో శతకాలు బాదిన మూడో భారత ఆటగాడు రోహిత్.
వేగానికి మారుపేరు... రో'హిట్'
పొట్టి క్రికెట్ టీ20ల్లో వేగవంతమైన శతకం కొట్టాడు రోహిత్‌శర్మ. వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన వీరుడు. టీ20ల్లో ఇప్పటి వరకు 4 శతకాలు చేసి మొదటిస్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా ముంబయి జట్టుకు సారథిగా 3 ఐపీఎల్ ట్రోఫీలను అందించాడు.
32 నాటౌట్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్
2009 ఐపీఎల్ మ్యాచ్... కోల్‌కతాపై గెలవాలంటే రోహిత్ ప్రాతినిధ్యం వహిస్తోన్న డెక్కన్ ఛార్జర్స్ జట్టుకు చివరి ఓవర్లో 21 పరుగులు అవసరం. అప్పుడు బౌండరీలే హద్దుగా చెలరేగి మోర్తజా బౌలింగ్‌ను చిత్తుచిత్తు చేశాడు రోహిత్. మనోడి దెబ్బకు ఒక్క ఓవర్లో 26 పరుగులు వచ్చాయి. విజయం లభించింది. ఇప్పటివరకు ఐపీఎల్లో అత్యుత్తమ ఛేదనగా ఈ మ్యాచ్ రికార్డు సృష్టించింది.