సుదీర్ఘ ఫార్మాట్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న టీమ్‌ఇండియా వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులోకి కూడా తీసుకురావాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అన్నాడు. భారత పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో పంత్ స్థానం కోల్పోగా, కేఎల్ రాహుల్ వికెట్‌కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
"పంత్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. అతడిని పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులోనూ తీసుకురావాలి. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పంత్ రెండు వీరోచిత ఇన్నింగ్స్‌లు ఆడాడు. కంగారూల గడ్డపై ఆడిన ఇన్నింగ్స్‌లు అంటే ప్రత్యేకంగా భావించాలి. పంత్‌కు బౌలింగ్ చేయాలంటే కాస్త శ్రమించాల్సి ఉంటుంది. అతడు వైవిధ్యమైన షాట్లు ఆడుతుంటాడు. అయితే శ్రేయస్ అయ్యర్ స్థానంలో అతడికి చోటు ఇవ్వాలి. లేదా సంజు శాంసన్‌కు బదులుగా ఆడించాలి. కాగా, ఆల్‌రౌండర్లను జట్టులోకి తీసుకువచ్చేలా టీమ్‌ఇండియా ప్రయత్నించాలి. అప్పుడు బౌలింగ్, బ్యాటింగ్‌లో మరింత బలం పెరుగుతుంది" అని హాగ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో భారత్ ఫిబ్రవరి 5 నుంచి నాలుగు టెస్టులు, అయిదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.