టీమ్‌ఇండియా యువ క్రికెటర్ రిషభ్‌పంత్ ఆటపై తనకు 'పిచ్చి' పట్టుకుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నారు. అతడు నిఖార్సైన మ్యాచ్ విజేతని ప్రశంసించారు. సీనియర్లు కోహ్లీ, రోహిత్ శర్మ ఆటనూ ఆస్వాదిస్తానని అన్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి బాగా ఆడతారని పేర్కొన్నారు. శార్దూల్ ఠాకూర్ అన్నాసరే ఇష్టమేనని తెలిపారు. ఎందుకంటే అతడికి ధైర్య సాహసాలు ఎక్కువని వెల్లడించారు. నిజానికి బోర్డు అధ్యక్షుడిగా ఎవరు ఇష్టమో చెప్పకూడదన్నారు. ఓ ట్యుటోరియల్ యాప్ ఏర్పాటు చేసిన సెషన్లో దాదా పైవ్యాఖ్యలు చేశారు.
'భారత్‌లో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు. సునీల్ గావస్కర్ ఆడుతున్నప్పుడు ఆయన తర్వాత ఏమవుతుందోనని అభిమానులు ఆందోళన చెందారు. కానీ సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే వచ్చారు. వాళ్లు వీడ్కోలు పలికాక కోహ్లీ, రోహిత్ శర్మ, రిషభ్ పంత్ బ్యాటన్ అందుకున్నారు. క్రికెట్ పరంగా దేశంలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు. ఏ తరంలోనైనా ఈ దేశం అత్యుత్తమ క్రికెటర్లను అందించగలదు' అని గంగూలీ ధీమా వ్యక్తం చేశారు.