తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ సమయంలో గుండె పగిలినట్లనిపించింది: పంత్​ - పంత్ బాధపడ్డాడు 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో

2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో జట్టుకు అవసరమైన సమయంలో ఔటైనప్పుడు గుండె పగిలినట్లనిపించింది అన్నాడు టీమ్​ఇండియా వికెట్​కీపర్​ పంత్​. అయితే ఆసీస్​ సిరీస్​ విజయంలో తాను కీలక పాత్ర పోషించడం ఎంతో సంతోషానిచ్చిందని చెప్పాడు. మానసికంగా బలంగా మారేందుకు లాక్‌డౌన్‌ తనకు ఉపయోగపడిందని వెల్లడించాడు.

panth
పంత్​

By

Published : Jan 25, 2021, 10:30 AM IST

టీమ్‌ఇండియాకు విజయాలు అందించడం కన్నా గొప్పేముంటుందని వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ అన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత ప్రదర్శనతో సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన అతడు ఈ విజయంపై మరోసారి హర్షం వ్యక్తం చేశాడు.

"2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో జట్టుకు అవసరమైన సమయంలో ఔటవడం వల్ల గుండె పగిలినట్లనిపించింది. అలాంటి అవకాశం మళ్లీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశా. నమ్మశక్యం కాని ప్రదర్శనతో కఠిన పరిస్థితుల్లో ఉన్న జట్టుకు విజయాలు సాధించాలని నేనెప్పుడూ కల కంటా. ఎన్ని పరుగులు చేశానన్నది ముఖ్యం కాదు. అవి జట్టు గెలుపునకు ఉపయోగపడ్డాయా? లేదా? అనేదే ప్రధానం. బ్రిస్బేన్‌ టెస్టులో అందుకే చివరి వరకూ క్రీజులో ఉండాలనుకున్నా. సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 97 పరుగులకు ఔటైనపుడు కూడా చివరి వరకూ నిలవలేకపోయానే అని బాధపడ్డా. అందుకే చివరి టెస్టులో మాత్రం ఆ పొరపాటు మళ్లీ చేయొద్దని అనుకున్నా. సుందర్‌తో ఆడుతున్నపుడు మా ఇద్దరిలో ఒకరు నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ నడిపిస్తే.. మరొకరు భారీ షాట్లు ఆడాలనుకున్నాం. నేను షాట్లు ఆడతానంటే సుందర్‌ కూడా అదే పని చేస్తానన్నాడు. చివరికి అతనే ఆ బాధ్యత తీసుకున్నాడు. కానీ ఆఖర్లో నేను షాట్లు ఆడాల్సి వచ్చింది" అని పంత్‌ తెలిపాడు.

మానసికంగా బలంగా మారేందుకు లాక్‌డౌన్‌ తనకు ఉపయోగపడిందని అతనన్నాడు. "లాక్‌డౌన్‌ నాకు వరంగా మారిందనే చెప్పొచ్చు. దాని కంటే ముందు ఎక్కువ ఒత్తిడికి లోనయ్యేవాణ్ని. కానీ ఆ సమయంలో కుటుంబంతో, స్నేహితులతో గడపడం వల్ల ప్రశాంతత కలిగింది. ఇప్పుడు కాస్త పరిణతి సాధించానని అనిపిస్తోంది. నా ఆటతీరులో కొన్ని మార్పులు చేసుకున్నా. సానుకూల దృక్పథంతో ఉండి, కష్టపడితే కచ్చితంగా ఫలితం వస్తుంది" అని పంత్‌ వెల్లడించాడు.

ఇదీ చూడండి:'పంత్​ ఆడుతుంటే ఇరుజట్లకు దడే'

ABOUT THE AUTHOR

...view details