2019.. క్రికెట్లో కొన్ని సంఘటనలు అభిమానులను ఆకట్టుకున్నాయి. మరికొన్ని క్రికెట్ ప్రేమికులను నిరాశకు గురిచేశాయి. అనేక అనుభవాలతో ప్రేక్షకుల మదిలో నిలిచిన కొన్ని మధుర స్మృతులివే. రోహిత్ ఐదు శతకాల నుంచి మలింగ వికెట్ల ప్రదర్శన వరకు ఇందులో ఉన్నాయి. యాషెస్, ప్రపంచకప్‌తో పాటు టీ20ల్లోనూ పలు రికార్డులు నమోదయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ 20వేల మైలురాయిని అందుకుంటే... మిథాలీ 200 వన్డే మ్యాచ్‌లు ఆడేసింది. వాటి విశేషాలు ఇవిగో...
జనవరి 7
టీమిండియా 2018 డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడింది. 2019 జనవరి తొలి వారం వరకు కొనసాగిన సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో కంగారూలను చిత్తు చేసింది. వారి సొంత గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి చారిత్రక విజయం సాధించింది.
జనవరి 26
29 ఏళ్ల కిందట సచిన్ సృష్టించిన రికార్డును ఓ నేపాలీ యువ క్రికెటర్ బద్దలు కొట్టిన రోజు అది. నేపాల్-యూఏఈ మధ్య జరిగిన అంతర్జాతీయ వన్డేలో 16ఏళ్ల రోహిత్ పౌడెల్ 58 బంతుల్లో 55 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు. అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసిన పురుష క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
సచిన్ 16 ఏళ్ల 213 రోజుల వయసులో.. ఫైసలాబాద్ వేదికగా జరిగిన వన్డేలో అర్ధ సెంచరీ చేసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ రికార్డు ఛేదించినపుడు రోహిత్ వయసు 16ఏళ్ల 146రోజులు కావడం విశేషం.
జనవరి 28
సింగపూర్ వేదికగా నేపాల్, జింబాబ్వే, సింగపూర్ జట్ల మధ్య జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో నేపాల్ కెప్టెన్ పరాస్ ఖడ్కా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుత క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అయిన విరాట్ కోహ్లీ, స్టీవ్‌స్మిత్‌లకు సాధ్యంకాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అరంగేట్ర టీ20లో శతకం బాదడమే కాకుండా.. లక్ష్య ఛేదనలో టీ20ల్లో శతకం సాధించిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ పరాస్ ఖడ్కా(106 నాటౌట్; 52 బంతుల్లో 7x4, 9x6) అజేయంగా నిలిచాడు.
ఫిబ్రవరి 1
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్.. 200వ వన్డే పూర్తిచేసిన ఏకైక మహిళా క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్ ఆమెకు 200వ వన్డే. 19 ఏళ్లకే వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేయగా.. ఇప్పటి వరకూ 51.33 సగటుతో 6622 పరుగులు చేసింది. టీమిండియా మహిళా క్రికెట్ జట్టు ఇప్పటి వరకు 263 వన్డేలు ఆడితే అందులో 200 మ్యాచ్‌లకు మిథాలీ సారథిగా వ్యవహరించడం విశేషం.
ఫిబ్రవరి 23
దక్షిణాఫ్రికాలో ఆతిథ్య జట్టుపై టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా దేశంగా శ్రీలంక చరిత్రకెక్కింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల తర్వాత దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ సాధించిన జట్టు శ్రీలంక మాత్రమే.
ఆసియా జట్లు దక్షిణాఫ్రికాలో 18 టెస్టు సిరీస్‌లు ఆడితే.. 16 మ్యాచ్‌ల్లో పరాజయం పొందగా.. 2 సిరీస్‌లు డ్రా అయ్యాయి. లంక ఆడిన ఆరు సిరీస్‌ల్లో ఇదే తొలి విజయం.
ఫిబ్రవరి 24
అఫ్గానిస్థాన్ పొట్టి క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. డెహ్రాడూన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ 278 పరుగులతో టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతానికి పొట్టి ఫార్మాట్‌లో ఇదే అత్యధిక స్కోరు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 2016లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 263 పరుగులు చేసింది.
మార్చి 18
అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. తన తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ఐర్లాండ్‌తో ఏకైక టెస్టులో అఫ్గాన్ 7 వికెట్ల తేడాతో గెలిచింది.
మార్చి 23
తొలిసారి 2020 అండర్-19 ప్రంపచకప్‌కు అర్హత సాధించింది నైజీరియా. నమీబియా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆ దేశాన్ని 52 పరుగుల తేడాతో గెలిచింది. అంతేకాకుండా ఉగాండాపై 30 పరుగుల తేడాతో, కెన్యాపై 58 రన్స్ తేడాతో గెలిచి ఈ మెగాటోర్నీకి అర్హత సాధించింది. దక్షిణాఫ్రికా వేదికగా ఈ ప్రపంచకప్ 2020లో జరగనుంది.
ఏప్రిల్ 27
వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్-2లో భాగంగా ఒమన్, నమీబియా మధ్య జరిగిన పురుషుల అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో తొలిసారి ఓ మహిళ అంపైర్‌గా వ్యవహరించింది. ఆస్ట్రేలియాకు చెందిన క్లెయిరే పొలొసాక్ ఈ మ్యాచ్‌లో అంపైర్‌గా వ్యవహరించి సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా న్యూసౌత్‌వేల్స్ - క్రికెట్ ఆస్ట్రేలియా XI మధ్య సిడ్నీలో జరిగిన పురుషుల వన్డే మ్యాచ్‌కు ఆమె అంపైర్‌గా వ్యవహరించింది.
జూన్ 1
ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సిక్సర్ల మోత మెగించాడు. ఏకంగా 17 సిక్స్‌లు బాది వన్డే క్రికెట్‌లో సిక్సర్ల రికార్డులో నూతన చరిత్ర సృష్టించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు సాధించిన క్రికెటర్‌గా మోర్గాన్ నిలిచాడు. అతడి తర్వాత రోహిత్‌శర్మ (16), ఏబీ డివిలియర్స్(16), క్రిస్ గేల్(16) ఉన్నారు.
జూన్ 20
పొట్టి ఫార్మాట్‌లో సరికొత్త రికార్డు నమోదు చేసింది ఉగాండా. మాలితో జరిగిన టీ20 మ్యాచ్‌లో 314 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో ఒక్కే ఒక్క సిక్సర్ ఉండడం విశేషం. క్విబుక విమెన్స్ టీ20 టోర్నమెంటులో ఈ రికార్డు నమోదైంది. అంతర్జాతీయ పురుషుల, మహిళా టీ20 చరిత్రలో ఇదే అత్యధికం.
జూన్ 27
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 20 వేల పరుగుల మైలురాయిని తక్కువ ఇన్నింగ్స్‌ల్లో(417) చేరుకున్నాడు విరాట్ కోహ్లీ. మొత్తంగా ఈ మైలురాయి అందుకున్న 12వ బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలిచాడు. సచిన్ తెందూల్కర్(34,357), రాహుల్ ద్రవిడ్(24,208) తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారత బ్యాట్స్‌మన్ కోహ్లీనే కావడం విశేషం.
జులై 6
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరిగిన ప్రపచంకప్‌లో ఐదు సెంచరీలతో ఆకట్టుకున్నాడు. భారత జట్టు సెమీస్ చేరడంలో ప్రధానపాత్ర వహించాడు. మాస్టర్ సచిన్, సంగక్కరల పేరుతో ఉన్న నాలుగు శతకాల ప్రపంచకప్ రికార్డును అధిగమించాడు.