1983 ఐసీసీ ప్రపంచకప్లో భారత్ ఓటమి అంచు నుంచి తప్పించుకోవడమే కాదు.. చరిత్రను తిరగరాసి మరీ విజయాన్ని సొంతం చేసుకుంది. భారత క్రికెట్ రూపురేఖలను మార్చింది అంటే అతిశయోక్తి కాదేమో. ఈ మెగాటోర్నీలో టీమ్ఇండియాకు సారథ్యం వహించిన కపిల్ దేవ్ సేన జాతికి గర్వకారణంగా నిలిచింది. ఇటీవలే ఈ విజయానికి 37 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే ఆ టోర్నీలో పాల్గొన్న ఆటగాళ్లతో పాటు ప్రస్తుత ఆటగాళ్ల జీతభత్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
అమ్మో ఇంత తక్కువా!
ఇప్పుడైతే మన క్రికెటర్లకు లక్షల, కోట్లలో జీతాలు ఉన్నాయనుకోండి. కానీ 1983 ప్రపంచకప్ విజేత అయిన కపిల్ సారథ్యంలోని జట్టు ఆటగాళ్ల జీతాలు తెలిస్తే ముక్కు మీద వేలు వేసుకోవాల్సిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ ఫొటో(అప్పట్లో వన్డే క్రికెట్ ఫార్మాట్లో చెల్లించే జీతం) నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీన్ని మీరూ చూసేయండి. ఇందులో కనీస వేతనం సారథితో సహా మిగతా ఆటగాళ్లకు రూ. 2100 గా ఉంది.
ప్రస్తుతం బీసీసీఐ ప్రపంచంలోనే ఖరీదైన బోర్డుల్లో ఒకటిగా నిలిచింది. మన ఆటగాళ్లకు కాంట్రాక్ పద్ధతుల్లో గ్రేడ్స్ వారిగా వారిని ఎంపిక చేసుకుంటుంది. అలాగే జీతాలు కూడా చెల్లిస్తోంది. ఏ, ఏ ప్లస్, బీ, సీ వంటి గ్రేడ్ ఆటగాళ్లు ఉంటారు. ఇందులో ఏ ప్లస్(7), ఏ(5), బీ(3), సీ(1) కోట్లు చెల్లిస్తోంది.
ప్రస్తుతం ఏ ప్లస్ జాబితాలో సారథి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా ఉన్నారు. వన్డే ఫార్మాట్లో ప్రతి మ్యాచ్కు ఒక్కో ఆటగాడికి ఆరు లక్షల రూపాయలు వేతనం కాగా టీ20కి ముడు లక్షలుగా ఉంది. టెస్టులకు అత్యధికంగా రూ. 15 లక్షలు చెల్లిస్తోంది.
దేశవాళీ క్రికెట్‌లో ఆటగాళ్లకు బాగానే చెల్లిస్తున్నాయి రాష్ట్రాల బోర్డులు. నాలుగు రోజుల రంజీ ట్రోపీలో ఆటగాళ్లకు రోజుకు రు.35వేలు చొప్పున వేతనం ఉంటుంది. ఓ ఆట మొత్తానికి సగటున ఒక్కో ఆటగాడు రూ. 3లక్షల రూపాయలు తీసుకుంటాడు.