విజయ్ హజారె ట్రోఫీలో 'రిజర్వే డే' లేకపోవడంపై బీసీసీఐని విమర్శించారు భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్. క్వార్టర్ ఫైనల్‌కు వరుణుడు అడ్డంకిగా మారడం వల్ల పంజాబ్ జట్టు సెమీస్‌కు చేరలేదని అన్నాడు.
" మరోసారి పంజాబ్‌కు ఊహించని ఫలితం. క్వార్టర్ ఫైనల్లో వాతావరణం సహకరించని కారణంగా తమిళనాడుతో పూర్తిగా పోరాడకముందే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. సాధించిన పాయింట్ల ప్రకారం సెమీస్‌కు చేరలేదు. విజయ్ హజారె ట్రోఫీలో ఎందుకు రిజర్వ్ డే లేదు? దేశవాళీ టోర్నమెంట్ అని రిజర్వ్ డే ఉంచలేదా?"
-- యువరాజ్ ట్వీట్
భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఈ ట్రోఫీలో రిజర్వ్ డే లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. "ఇలాంటి టోర్నీల్లో రిజర్వ్ డే ఎందుకు లేదు? బీసీసీఐ దీనిపై ఆలోచించి మార్పులు చేయాలి" అని భజ్జీ ట్వీట్ చేశాడు.
క్వార్టర్ ఫైనల్స్‌కు వర్షం అడ్డంకి కలిగించడం వల్ల లీగ్ దశలో ఎక్కువ విజయాలు సాధించిన తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ సెమీస్‌కు చేరాయి. తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 12.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది. వరుణుడు అడ్డంకిగా మారడం వల్ల మ్యాచ్‌ను కొనసాగించలేదు. సెమీఫైనల్లో కర్ణాటకXఛత్తీస్‌గఢ్, గుజరాత్Xతమిళనాడు తలపడగా... బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో గెలిచి టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి కర్ణాటక, తమిళనాడు జట్లు.