అతడు కనిపిస్తే ప్రతి భారత క్రికెట్ అభిమాని గుండెల్లో ఆశ.. లక్ష్యం ఎంతున్నా విజయం తమదే అనే ధీమా.. జట్టు ఇబ్బందుల్లో ఉంటే అతడున్నాడనే నమ్మకం.. తుపాను ముందు ప్రశాంతతలా కనిపిస్తూ విధ్వంసం సృష్టించే సునామీ.. అతడే ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఝార్ఘండ్ డైనమెట్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ. వార్షిక కాంట్రాక్టు నుంచి తాజాగా బీసీసీఐ.. మహీని తొలగించిన నేపథ్యంలో అతడి కెరీర్ ఇంక ముగిసిపోయినట్లేనా.. అంతర్జాతీయ క్రికెట్లో మహీ ఇంక కనిపించడా అని సగటు క్రికెట్ అభిమాని భావన. ఈ తరుణంలో ధోనీ కెరీర్లో కొన్ని మరపురాని విజయాలపై ఓ లుక్కేద్దాం!
తుపానులా వచ్చాడు...
శ్రీలంకపై 2004లో జరిగిన వన్డేలో మహీ విశ్వరూపమే చూపించాడు. అంతకుముందే పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 148 పరుగులతో తానేంటో నిరూపించుకున్న ధోనీ.. లంకేయులను బెంబేలెత్తించాడు. 183 పరుగులతో నాటౌట్‌గా నిలిచి 50 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఆ సమయంలో 299 పరుగుల లక్ష్య ఛేదన అంటే మామూలు విషయం కాదు అలాంటింది ధోనీ ధాటికి లక్ష్యం చిన్నదైంది. ఓపెనర్లు సచిన్, సెహ్వాగ్ కొద్ది పరుగులకే వెనుదిరిగిన వేళ మహీ అద్భుతమే చేశాడు. ఫలితంగా మ్యాచ్ టీమిండియా సొంతమైంది. ఈ మ్యాచ్‌లో ధోనీ 15 ఫోర్లు, 10 సిక్సర్లతో వీరవిహారం చేశాడు.
టీమిండియాకు చిరు బహుమతి..
2007 టీ-20 ప్రపంచకప్‌లో అదృష్టవశాత్తు కెప్టెన్ అవతారమెత్తిన మహీ... ఆ పదవిని శాశ్వతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా వేదికగా తొలిసారి జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో టీమిండియా అభిమానులను నిరాశకు గురిచేయకుండా కప్పును భారత్ వశం చేశాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో బౌలర్ జోగిందర్ శర్మతో నిలకడగా బౌలింగ్ చేయించి ప్రమాదకరంగా మారుతున్న మిస్బాను పెవిలియన్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా తొలి పొట్టి ప్రపంచకప్‌ను భారత్ ఒడిసిపట్టింది.
టెస్టుల్లో అగ్రస్థానం..
పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు టెస్టు క్రికెట్లోనూ మంచి విజయాలను అందించిన సారథుల్లో మహేంద్రసింగ్ ధోనీ ఒకడు. దీర్ఘకాలిక ఫార్మాట్లో భారత జట్టును అగ్రస్థానంలో నిలిపిన తొలి టీమిండియా కెప్టెన్‌గా మహీ రికార్డు సృష్టించాడు. క్రికెట్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం వహిస్తున్న రోజుల్లో భారత్‌కు చెరగని విజయాలను అందించాడు మహీ. శ్రీలంక(2-0), బంగ్లాదేశ్(2-0), స్వదేశంలో దక్షిణాఫ్రికా(1-1)పై డ్రా లాంటి ఫలితాలతో 2009లో తొలిసారి ఆస్ట్రేలియా నుంచి అగ్రపీఠం కైవసం చేసుకుంది టీమిండియా.
28 ఏళ్ల నిరీక్షణకు తెర..
ధోనీ సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్ విజయానంతరం అందరి కళ్లు.. 2011 వన్డే వరల్డ్‌కప్‌పైనే పడ్డాయి. ఎందుకంటే క్రికెట్ దేవుడు సచిన్‌కు అదే చివరి ప్రపంచకప్. అంతేకాకుండా మెగాటోర్నీలో టీమిండియా విజేతగా నిలిచి అప్పటికి 28 ఏళ్లయింది. వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో అద్భుత విజయాన్నందించి 28ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించాడు ధోనీ. 275 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ధోనీ 79 బంతుల్లో 91 పరుగులతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఇందులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గౌతం గంభీర్ కూడా 97 పరుగులతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
సారథులకే సారథి..
ఐసీసీ ట్రోఫీలన్నీ కైవసం చేసుకున్న ఏకైక కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు సృష్టించాడు. 2007 టీ-20, 2011 వన్డే ప్రపంచకప్‌లను అందించిన మహీ.. 2013 ఛాంపియన్స్ ట్రోఫీనీ ఒడిసి పట్టాడు. ఈ టోర్నీలో యువకులతో బరిలోకి దిగిన ధోనీ.. విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఫలితాలను రాబట్టాడు. ఈ ఏడాదే రోహిత్ శర్మను ఓపెనర్‌గా పంపించి అతడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాడు. ఫైనల్లో ఇంగ్లాండ్‌పై అద్భుత విజయాన్నందించి.. బ్రిటీష్ గడ్డపై భారత జెండాను రెపరెపలాడించాడు మహేంద్రసింగ్ ధోనీ.
2004లో అనామకుడిగా క్రికెట్లో అరంగేట్రం చేసి అతికొద్ది కాలంలోనే అప్రతిహత విజయాలను అందించాడు ధోనీ. అన్ని ఫార్మాట్లలో కలిపి 17226 పరుగులు చేశాడు. కీపర్‌గా 829 ఔట్లలో పాలుపంచుకున్నాడు. 350 వన్డేలు, 90 టెస్టులు, 98 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 2007లో టీ-20, 2011లో వన్డే ప్రపంచకప్‌లు అందించాడు.
ఇదీ చదవండి: తల్లులైన న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ల జంట!