వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ కోసం ఆటగాళ్ల బదిలీలు ముగిశాయి. ఇందులో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్ క్రిస్ లిన్ను వదులుకుంది. ఈ విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ స్పందించాడు. ఆసీస్ ఆటగాడు లిన్ను వదులుకోవడం కేకేఆర్ చేసిన అతిపెద్ద తప్పిదమని అభిప్రాయపడ్డాడు.
"అబుదాబి టీ10 లీగ్లో లిన్ అదరగొట్టాడు. అద్భుతమైన షాట్స్ ఆడాడు. ఐపీఎల్ కేకేఆర్ తరఫునా గొప్పగా రాణించాడు. కోల్కతా నైట్రైడర్స్ అతడిని ఎందుకు అంటిపెట్టుకోలేదో అర్థం కావడం లేదు. ఇది ఓ పెద్ద తప్పిదం."
-యువరాజ్ సింగ్, టీమిండియా మాజీ ఆటగాడు
క్రిస్ లిన్ కూడా అబుదాబి టీ10 లీగ్లో యువరాజ్ ఆడుతున్న మరాఠ అరేబియన్స్ తరఫున బరిలో ఉన్నాడు. నిన్న జరిగిన మ్యాచ్లో 30 బంతుల్లో 91 పరుగులు చేసి ఈ లీగ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ (32 బంతుల్లో 87) పేరిట ఉండేది.