క్రీజులో అడుగుపెడితే పరుగుల వరద పారించే సూపర్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. భారత సారథిగా విరాట్ తనను తాను నిరూపించుకున్నాడు. గతంలో పలు సందర్భాల్లో పలువురు భారత ఆటగాళ్లు ఈ విషయమై అతడిని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సారథ్యం వహిస్తోన్న కోహ్లీ నాయకత్వ ప్రతిభకు అద్దంపట్టే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇందులో నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో ఆర్సీబీ బౌలర్లను కోహ్లీ ప్రోత్సాహిస్తూ కనిపించాడు. జట్టులోని ఆటగాళ్లకు ఆ జట్టు బౌలింగ్ కోచ్ అడమ్ గ్రిఫిత్ ఫన్నీ బౌలింగ్ ఛాలెంజ్ పోటీ పెట్టాడు. ఈ సవాల్ మేరకు కింద పడివున్న స్టంప్‌ను తాకేలా బౌలర్లు బంతిని విసరుతున్నారు. ఇందులో భాగంగా వారిని విరాట్ ప్రోత్సహిస్తూ కనిపించాడు. ఈ తీరును నెటిజన్లు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.