అంతా అనుకున్నట్లే జరిగింది. టీమ్ఇండియాకు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విషయంలో మళ్లీ నిరాశే ఎదురైంది. ఇప్పటికే ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరమైన అతడు మరో రెండు టెస్టులకు అందుబాటులో ఉండట్లేదు. పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ అతడు ఆడేది అనుమానంగా మారింది. ఈ విషయాన్ని క్రికెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆస్ట్రేలియాలో జరిగిన మూడో టెస్టులో గాయపడిన జడ్డూ.. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నాడు.
బొటన వేలు ఫ్రాక్చర్ అయిన జడేజాకు ఆస్ట్రేలియాలోనే సర్జరీ జరిగింది. జడ్డూకు కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అయితే ఇప్పుడు అనుకున్న దాని కన్నా ఎక్కువ సమయం విశ్రాంతి అవసరమయ్యేలా ఉందని తెలిసింది. కాబట్టి అతడు టెస్టు సిరీస్‌కు పూర్తిగా దూరమవుతాడని అంటున్నారు. అంతకముందు ఇదే విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి కూడా అన్నారు.