తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆకాశ్ చోప్రా ప్రకారం బెస్ట్ ఫీల్డర్స్ వీరే!

టీమ్​ఇండియా క్రికెట్​లో అత్యుత్తమ ఫీల్డర్లను ఎంచుకున్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. మొత్తం ఆరుగురు క్రికెటర్లను ఉత్తమ ఫీల్డర్లుగా గుర్తించాడు. వారెవరో చూద్దాం.

ఆకాశ్ చోప్రా ప్రకారం బెస్ట్ ఫీల్డర్స్ వీరే!
ఆకాశ్ చోప్రా ప్రకారం బెస్ట్ ఫీల్డర్స్ వీరే!

By

Published : Jul 13, 2020, 9:39 PM IST

టీమ్‌ఇండియా క్రికెట్‌లో ఆరుగురు అత్యుత్తమ ఫీల్డర్ల గురించి వివరించాడు మాజీ బ్యాట్స్‌మన్‌ ఆకాశ్‌ చోప్రా. తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన అతడు మూడు తరాల్లోని భారత ఫీల్డర్లపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు. అందులో రవీంద్ర జడేజా తొలిస్థానంలో నిలవగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆరో స్థానంలో ఉన్నాడు. ఇక మిగతా క్రికెటర్లలో యువరాజ్‌ సింగ్‌, మహ్మద్‌ కైఫ్‌, సురేశ్‌ రైనాతో పాటు దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ ఉన్నాడు.

కోహ్లీ గురించి మాట్లాడిన చోప్రా.. ఆటగాడిగా ఎలా ఎదుగుతున్నాడో ఫీల్డర్‌గానూ అలా మెరుగవుతున్నాడని చెప్పాడు. కోహ్లీ స్లిప్‌లో క్యాచ్‌లు వదిలేసినా మైదానంలో ఎక్కడైనా ఫీల్డింగ్‌లో మంచి ప్రదర్శన చేస్తున్నాడని తెలిపాడు. అనంతరం కపిల్‌దేవ్‌కు ఐదో స్థానం కేటాయించిన చోప్రా.. 1983 ప్రపంచకప్‌ ఫైనల్లో విండీస్‌ దిగ్గజం సర్‌ వివ్‌ రిచర్డ్స్‌ క్యాచ్‌ను అద్భుతంగా పట్టుకున్నాడని కొనియాడాడు.

అలాగే యువరాజ్‌సింగ్‌కు నాలుగు, మహ్మద్‌ కైఫ్‌కు మూడో స్థానం కేటాయించాడు ఆకాశ్. వీళ్లిద్దరూ టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ స్వరూపాన్నే మార్చేశారని గుర్తు చేసుకున్నాడు. ముఖ్యంగా యువీ త్రోలు కైఫ్‌ కన్నా అద్భుతంగా ఉంటాయని, బంతిని నేరుగా వికెట్లకు విసురుతాడని చెప్పాడు. వీరు మైదానంలో చురుగ్గా ఉంటారని, బంతి ఎటువైపు వెళ్తున్నా అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని అందుకుంటారని పేర్కొన్నాడు. కైఫ్‌ స్లిప్‌లోనూ క్యాచ్‌లు అందుకోగల సమర్థుడని మెచ్చుకున్నాడు.

సురేశ్‌ రైనాకు రెండో స్థానం కేటాయించిన చోప్రా.. అతడు మైదానంలో ఎక్కడైనా ఫీల్డింగ్‌ చేయగలడని కితాబిచ్చాడు. కవర్స్‌లో, స్లిప్‌లో, బౌండరీ లైన్‌ వద్ద ఎక్కడైనా మంచి ఫీల్డింగ్‌ చేస్తాడన్నాడు. చివరగా జడేజా గురించి స్పందించిన మాజీ బ్యాట్స్‌మన్‌.. అతడిని సర్‌ రవీంద్ర జడేజా అని సంబోధించాడు. అతడికి రాకెట్‌లా వేగంగా స్పందించే చేతులున్నాయని, ప్రస్తుత క్రికెట్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్‌ అని మెచ్చుకున్నాడు. అతడి గ్రౌండ్‌ కవరేజ్‌ చాలా బాగుంటుందని, స్లిప్‌లో తప్పిస్తే ఎక్కడైనా చిరుతలా కదులాడుతాడని చెప్పాడు. అందువల్లే జడ్డూకు తొలి స్థానం ఇచ్చినట్లు చోప్రా స్పష్టం చేశాడు.

ABOUT THE AUTHOR

...view details