ఉరిమే ఉత్సాహం జడేజా సొంతం. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ ఫీల్డర్లలో అతను ఒకడు. చిరుతలా పరిగెడుతూ బౌండరీల దగ్గర అతను చేసే విన్యాసాలు.. పరుగులను నియంత్రిస్తూ కొట్టే డైవ్ లు అన్నీ జట్టుకు అదనపు ప్రయోజనాలు చేకూర్చేవే. కష్టతరమైన క్యాచ్ లనూ అతి సులభంగా అందుకుంటూ జడేజా జట్టుకు అండగా నిలబడుతున్నాడు. కెరీర్ ఆరంభంలో మహేంద్రసింగ్ ధోనీ తనను నమ్మి ఇచ్చిన మద్దతు ఈరోజు కెరీర్లో తన నిలబడటానికి కారణం అని జడేజా చెప్పుకుంటాడు. అండర్-19 కాలం నుంచి తన సహచరుడు విరాట్ కోహ్లీ ప్రస్తుత భారత కెప్టెన్ కావటం.. రవీంద్ర జడేజా స్వేచ్ఛగా తన ఆట ఆడుకునేందుకు వీలు కల్పిస్తోంది. మధ్యలో పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి తప్పించినట్లు కనిపించినా.. ఐపీఎల్లో తన అద్భుతమైన మెరుపులతో.. సెలక్టర్లు ఎంపిక చేయక తప్పదు అనే పరిస్థితులను సృష్టించాడు రవీంద్ర జడేజా. ప్రత్యేకించి గడిచిన ఏడాదిన్నరగా అతనిలో కనిపించిన మార్పు.. చూపిస్తున్న పరిణితి భారత్ క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప ఆల్‌రౌండర్‌గా నిలవాలనే అతని కాంక్షను ప్రస్ఫుటం చేస్తున్నాయి.
ప్రపంచం నివ్వెర పోయేలా..
2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ను భారత అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. 240 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక భారత్ చతికిల పడితే.. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 59 బంతుల్లో 77పరుగులు చేసిన రవీంద్ర జడేజా పోరాటపటిమను ఏ క్రికెట్ అభిమాని గుర్తు పెట్టుకోకుండా ఉండలేడు. ఆ మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయి ఉండొచ్చు గాక.. కానీ అప్పటివరకు ఆకతాయి ఆటగాడిగా పేరుపొందిన రవీంద్ర జడేజాలోని పోరాటయోధుడిని క్రికెట్ ప్రపంచం నివ్వెర పోయి చూసింది. అప్పటి నుంచి ప్రతి మ్యాచ్‌కు పరిణితి సాధిస్తూ వస్తున్న రవీంద్ర జడేజా.. మూడు ఫార్మాట్లలోనూ భారత్ క్రికెట్‌కు కీలక ఆటగాడిగా మారి మెల్బోర్న్ టెస్టుతో అరుదైన ఘనతను సాధించాడు.