అశ్విన్:
గబ్బా మీ కోసం ఎదురుచూస్తోంది.. నాలుగో టెస్టుకు ముందు ఏ ఆసీస్ ప్లేయర్‌ను చూసినా ఇదే డైలాగ్. నాకొక తమిళ సినిమా గుర్తొస్తుంది. సి.సుందర్, హాస్యనటుడు వడివేలు మధ్య నడిచే సంభాషణ అది. వడివేలు అచ్చం మన టిమ్ పైన్లా ఏదో పెద్దరౌడీగా బిల్డప్ ఇస్తూ సి.సుందర్‌ను బెదిరిస్తాడు. మా ఏరియాకి రా చూసుకుందాం అంటాడు. సి.సుందర్ ఆ ఏరియాకి వెళ్తే మా ఇంటికి రా చూసుకుందాం అంటాడు. సరే అని వెళ్తే వడివేలు కాళ్లమీద పడిపోయి వదిలేయమని బతిమిలాడతాడు. అలానే మనల్ని ఆస్ట్రేలియాకు రమ్మన్నారు వచ్చి మెల్బోర్న్ గెలిచాం.. సిడ్నీ డ్రా చేశాం. ఇది కాదు మా ఇంటికి రండిరా అన్నట్లు గబ్బాకు పిలిచారు. ఆటగాళ్ల ప్రగల్భాలు విని ఏదో ఉంటుందని అనవసరంగా ఆలోచించాను. గబ్బాకు వచ్చేటప్పటికీ నేను అసలు నిలబడలేని పరిస్థితి. నడుం పట్టేసి చాలా ఇబ్బంది పడ్డాను.
శ్రీధర్:
సిడ్నీ నుంచి బ్రిస్బేన్‌కు విమాన ప్రయాణమంతా నిలబడే ఉన్నావు. ల్యాండింగ్ సమయంలో కూర్చోండి అంటూ ఎయిర్ హోస్టెస్ నిన్ను బ్రతిమిలాడటం నేను గమనించాను.
అశ్విన్:
సిడ్నీ ఎఫెక్ట్‌తో నిలబడితే కూర్చోలేని, కూర్చుంటే నిల్చోలేని పరిస్థితికి వచ్చేశాను. అలా గబ్బాలో దిగాం. మ్యాచ్‌లో బుమ్రా లేడు, నేను, జడేజా గాయాలతో ఆడలేని పరిస్థితుల్లో డ్రెస్సింగ్ రూంకే పరిమితమైపోయాం. ఎప్పటిలానే టాస్ ఓడిపోయాం. ఆసీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. చూస్తే జట్టులో యువరక్తం, ఉరకలెత్తే ఉత్సాహంతో టీంలోకి వచ్చిన కుర్రాళ్లే అంతా. ఇలాంటి పరిస్థితుల్లో అనుభవజ్ఞులైన బౌలర్లకు, కొత్త బౌలర్లకు మధ్య వ్యత్యాసం ఏంటి?
శ్రీధర్:
ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు ప్రపంచంలో టాప్ బౌలర్లలో ఒకరైనప్పటికీ నీ శరీరం ఆటకు అలసిపోతుంటే నీ ప్రణాళికలను జట్టుకోసం సరిగా అమలు చేయలేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా పనిభారం పంచుకోవాలనే దానికి ఈ టెస్ట్ మ్యాచ్ ఓ గొప్ప ఉదాహరణ. రంజీ ట్రోఫీలైనా సరే ఓ బౌలర్ టోర్నమెంట్ అంతా ఆడాడంటే ఇక పని ఖాళీ అయినట్లే. మార్చిలో ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్ కోసం అప్పటివరకూ రంజీ ట్రోఫీ ఆడి ఓ నలభై వికెట్లు తీసిన బౌలర్‌ను తీసుకుంటారు. అతడు విఫలమైతే తిరిగి తప్పిస్తారు. వాస్తవానికి అతడిలో ప్రతిభలేదని కాదు.. పూర్తిగా అలసిపోయాడని.
అశ్విన్:
గబ్బాకు స్వాగతం అన్నారు. బబుల్ దాటి వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించారు. కానీ అనూహ్యంగా స్టేడియాల్లోకి 15వేలమంది ప్రేక్షకులను అనుమతించారు.
శ్రీధర్:
సర్కస్‌లో జోకర్స్లా ఉంది మన పరిస్థితి అప్పుడు.
అశ్విన్:
బోనులో బంధించిన జంతువులను చూసినట్లు జూలో జనాలు సందర్శించినట్లు మనల్ని చూస్తున్నారు. పైగా గబ్బాకు రావద్దంటూ.. భయపడతారంటూ ఆసీస్ అభిమానులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య భారత్ విజయానికి దారితీసిన కారణాలేంటి అనుకుంటున్నారు. పదును లేని ఆసీస్ ఆటా.. నిర్భీతిగా భారత్ అవలంబించిన ప్రణాళికలా.. లేదా భారత కుర్రాళ్లు ఢీ అంటే ఢీ అని పోరుకు దిగటమా..?
శ్రీధర్:
మూడు కారణాలు కలిపి అనుకోవచ్చు. చాలా కారణాలు కలగలిసి గబ్బాలో విజయాన్ని అందించాయి. వాస్తవానికి ఆ ధైర్యం సిడ్నీ నుంచి వచ్చింది మనకు. 131 ఓవర్ల పాటు మనవాళ్లు బ్యాటింగ్ చేసిన విధానం, వాళ్ల బౌలర్లను అలసిపోయేలా చేసింది. అంతకు మించి మనం ఎలా అయినా సాధించగలం అంటూ మన కుర్రాళ్లు చూపించిన తెగువ.. భారత్ నుంచి క్రికెట్ అభిమానుల ప్రార్థనలు, ఆశీస్సులు అన్నీ కలగలసి మన ఆటగాళ్లలో తెలియని సానుకూల దృక్పథాన్ని, గెలిచి తీరాలన్న కసిని బలంగా నింపేశాయి.
అశ్విన్:
అసలు ఇంతకు ముందు ఓ సిరీస్‌లో ఆఖరి టెస్టును ఇంత తాజాగా ఎప్పుడు మొదలు పెట్టామో కూడా గుర్తు లేదు. ఎందుకుంటే ఓ సిరీస్‌లో 16మందినీ ఆడిస్తేనే గొప్ప విషయం అలాంటిది 20 మంది ఆటగాళ్లును మార్చి ఆడించాల్సి వచ్చింది.
శ్రీధర్:
సిరీస్‌లో నాలుగు టెస్టుల్లోనూ తుది జట్టులో ఉన్న ఆటగాళ్లు ఇద్దరు మాత్రమే అజింక్యా రహానె, ఛెతేశ్వర్ పుజారా. మిగతా అందరిదీ మార్పులు చేర్పుల వ్యవహారమే.
అశ్విన్:
గబ్బాలో మొదటి రోజు ఆసీస్‌కు మంచి ఆరంభమే లభించింది. రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి నిలకడగా పరుగులు చేసింది. మొత్తం మీద వాళ్లు చేసిన 369 పరుగులు అంత తక్కువ స్కోరైతే కాదు.అనుభవం లేదు, సైనీ కూడా బౌలింగ్ చేయలేకపోవటం వల్ల ఐదుగురు బౌలర్లు లేకుండానే మన బౌలింగ్ బృందం చాలా కష్టపడింది. అసలేంటిది. గతంలో ఎప్పుడూ చూడనంత పనిభారమా.. ఇంత మంది గాయపడటానికి కారణాలేంటి?
శ్రీధర్:
నిజానికి గడచిన సంవత్సరంగా మన వాళ్లు క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. రంజీట్రోఫీ లేదు. సుదీర్ఘ ఐపీఎల్ సీజన్‌ను ముగించుకుని నేరుగా ఆస్ట్రేలియాకు వచ్చారు.
అశ్విన్:
అదే సమయంలో మా కంటే ఆసీస్ ఎక్కువ క్రికెట్ ఆడింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ను ప్రారంభించి క్రికెట్ మూడ్‌లోకి ముందుగానే వచ్చేసింది.
శ్రీధర్:
కొవిడ్ విజృంభణ ఉన్నా వారికి జూన్ నుంచి మైదానాలు తెరిచారు. స్టేడియాల్లో ఆట తిరిగి ప్రారంభమైంది. షెఫీల్డ్ టోర్నీని నిర్వహించారు. ఆ తర్వాత ఐపీఎల్‌కు వచ్చి ఆడారు. సన్నద్ధతలో భారత్ కన్నా కొంచెం మెరుగ్గానే ఉంది వారి పరిస్థితిపైగా టెస్ట్ సిరీస్ జరిగేది వారి సొంత గడ్డపై. కనుక విశ్లేషిస్తే చాలా కారణాలే ఉన్నాయి.
అశ్విన్:
భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో మన పరిస్థితి 180/6. నేను కూడా కోచింగ్ బృందంతోనే కలిసి కూర్చుని మ్యాచ్ చూశాను. శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ బ్యాటింగ్ చేస్తున్నారు. మనమిద్దరం సరదాగా వేసుకున్న బెట్ గుర్తుందా?
శ్రీధర్:
లేదు, నేను మర్చిపోయా(నవ్వుతూ)
అశ్విన్:
నాకు గుర్తుంది నేను చెబుతా. శార్దుల్ ఠాకూర్ కనుక 40 బంతులు ఎదుర్కొని నిలబడగలిగితే అర్ధశతకం కొడతాడని నేను శ్రీధర్‌తో పందెం కట్టాను. ఆ బెట్ ఓడిపోయినందుకు శ్రీధర్ గర్వపడి ఉండాలి.(నవ్వుతూ)
శ్రీధర్:
నిజానికి నేను ఎప్పుడు పందెం వేసినా నిరాశవాదిలా ప్రవర్తిస్తాను.
అశ్విన్:
లేదు నాకు తెలుసు. వాషింగ్టన్ సుందర్ తేలికగా బ్యాటింగ్ చేయగలడు. నేను ఎంఆర్ఎఫ్లో అతని ఆటను చాలా సార్లు గమనించాను. బౌన్సీ ట్రాక్‌లపై అతడు ఆడేస్తాడు. కానీ శార్దుల్ ఆడతాడని ఎవరూ అనుకోరు. పిట్ట కొంచెం కూత ఘనం అంటారు కదా అలా అనుకోవాలి శార్దుల్ బ్యాటింగ్‌ను.
శ్రీధర్:
ఆ మాట వాస్తవం. అతడిలో పోరాట తత్వం మెండుగా ఉంది. తన ఆటను బలంగా నమ్ముతాడు.
అశ్విన్:
కొన్ని సార్లు అతడి నమ్మకాన్ని మనం అంచనా కూడా వేయలేం. వికెట్ తీస్తానని ఫుల్ టాస్‌లు వేస్తాడు. ఏంటిది అని మనం అనుకునేలోపే ప్రత్యర్థి వికెట్ తీసేస్తాడు. అతడి ప్రణాళికలు విభిన్నంగా ఉన్నా ఫలితాలు తీసుకువస్తాయి.
శ్రీధర్:
శార్దుల్ కొట్టిన కవర్ డ్రైవ్‌లు మర్చిపోగలమా అసలు?
అశ్విన్:
గబ్బా టెస్టులో రెండు క్రికెటింగ్ షాట్ల గురించి మాట్లాడుకోవాలి ఒకటి కమిన్స్‌ను సుందర్ ఆడిన విధానం.. రెండు వివియన్ రిచర్డ్స్ స్టైల్లో శార్దుల్ ఠాకూర్ కొట్టిన కవర్ డ్రైవ్ లు.
శ్రీధర్:
సచిన్ కవర్ డ్రైవ్‌లను పోలి ఉన్నాయి ఆ షాట్ లు. అందుకే డ్రెస్సింగ్ రూంలో శార్దుల్ కర్ అనే మాట వినిపించింది. అంతే కాకుండా 80ల్లో వెస్టిండీస్ జట్టులో కనిపించిన కరేబియన్ పొగరు శార్దుల్ షాట్స్‌లో స్పష్టంగా కనిపించింది. కమిన్స్, స్టార్క్, హేజిల్ వుడ్ ఎవరినీ వదల్లేదు. పరుగులు పెట్టించాడు బోర్డును.