ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమ్‌ఇండియా అద్భుతంగా పోరాడింది. ఆతిథ్య జట్టు విజయాన్ని అడ్డుకొంది. ఓడిపోయే మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. 407 పరుగుల లక్ష్య ఛేదనలో ఐదో రోజు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 334 పరుగులతో నిలిచింది. పంత్, పుజారా, అశ్విన్, విహారి కసి, పట్టుదలతో జట్టును అపజయం పాలవ్వకుండా రక్షించారు. సిరీసును 1-1తో సమం చేశారు.
మ్యాచులో పిక్క కండరాల గాయంతో పరుగు తీయలేకపోయిన హనుమ విహారిని మనం గమనించాం. కానీ అశ్విన్ అంతకన్నా ఎక్కువ నొప్పిని అనుభవించాడన్న సంగతి ఆలస్యంగా తెలిసింది. నాలుగో రోజు రాత్రి విపరీతమైన నడుం నొప్పితో నిద్రపోయాడట అశ్విన్. ఉదయం లేవగానే నిటారుగా నిలబడలేక విలవిల్లాడాడని అతడి సతీమణి ప్రీతి తెలిపింది. అలాంటిది తన భర్త అంత గొప్ప ఇన్నింగ్స్ ఎలా ఆడాడోనని ఆశ్చర్యపోయింది.
"భరించలేని నొప్పితో ఆయన (అశ్విన్) రాత్రి నిద్రపోయారు. ఉదయం లేవగానే నిటారుగా నిలబడలేక ఇబ్బంది పడ్డారు. బూట్ల లేసులను కట్టుకొనేందుకు కనీసం వంగలేకపోయారు. అలాంటిది అశ్విన్ ఈ రోజు ఇలా ఆడటం అద్భుతమే" అని ప్రీతి ట్వీట్ చేశారు. అయితే ఈ కష్టసమయంలో తనకు తోడుగా నిలిచినందుకు ఆమెకు యాష్ ధన్యవాదాలు తెలిపాడు.
రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ (97; 118 బంతుల్లో 12×4 3×6) మెరుపులు మెరిపించగా చెతేశ్వర్ పుజారా (77; 205 బంతుల్లో 12×4) బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. వారి ఊపుతో విజయంపై ఆశలు చిగురించినా వెంటవెంటనే ఔటవ్వడం వల్ల గుబులు పుట్టింది. ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ (39*; 128 బంతుల్లో 7×4), హనుమ విహారి (23*; 161 బంతుల్లో 4×4) తమ పట్టుదల, పోరాట పటిమను ప్రదర్శించారు. ఒళ్లంతా నొప్పులు పెట్టినా.. కాళ్లు లాగేస్తున్నా.. ఆఖరి సెషన్లో 34 ఓవర్లు ఆడి హృదయాలను గెలిచారు.