టీమ్‌ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి భారత క్రికెట్‌లోకి అడుగుపెట్టి నేటికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన ట్విట్టర్‌లో తన అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం నాటి ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. 1981 ఫిబ్రవరి 21న న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో తొలి అంతర్జాతీయ టెస్టు ఆడినట్లు చెప్పాడు. ఇన్నేళ్లు గడుస్తున్నా ఇంకా ఈ ఆటతో, టీమ్‌ఇండియాతో ప్రయాణించడం గొప్పగా ఉందని శాస్త్రి హర్షం వ్యక్తం చేశాడు.
మరోవైపు టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌గా రవిశాస్త్రి 11 ఏళ్లు సేవలందించాడు. అందులో 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. ఈ క్రమంలోనే సుదీర్ఘ ఫార్మాట్‌లో 3,830 పరుగులు, 151 వికెట్లు సాధించాడు. అలాగే వన్డే ఫార్మాట్‌లో 3,108 పరుగులు, 129 వికెట్లు పడగొట్టాడు. అయితే, అతడు తొలి అంతర్జాతీయ పర్యటనలోనే మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఆపై కపిల్ నేతృత్వంలోని 1983 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు.