భారత క్రికెట్‌జట్టు సారథి కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి మూర్తిమత్వం ఒకేలా ఉంటుందని టీమ్‌ఇండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. అందుకే ఈ ద్వయం విజయాల శాతం ఎక్కువని చెప్పాడు. విరాట్‌కు ఏం ఇవ్వాలో శాస్త్రికి తెలుసని, కోచ్ ఏం ఆశిస్తాడో కెప్టెన్‌కు తెలుసని పేర్కొన్నాడు. స్టార్‌స్పోర్ట్స్ 'క్రికెట్ కనెక్టెడ్' కార్యక్రమంలో నెహ్రా ఈ విధంగా మాట్లాడారు.
కోహ్లీ, రవిశాస్త్రి ఎంత చనువుగా, సన్నిహితంగా ఉంటారో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కలయికలో టీమ్‌ఇండియా ఎన్నో ఘన విజయాలు అందుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి సిరీస్ కైవసం చేసుకుంది. న్యూజిలాండ్‌లోనూ సత్తా చాటింది. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లో నువ్వా నేనా అన్నట్టు పోటీపడింది. పేస్ విభాగం దుర్భేద్యంగా మారింది. టెస్టుల్లో అగ్రస్థానాన్ని కొనసాగించింది. అయితే ఐసీసీ వన్డే ప్రపంచకప్-2019లో సెమీస్‌లో ఓటమి, నాలుగో స్థానంపై స్పష్టత లేకపోవడం, మిడిలార్డర్‌పై సందేహాలు ఈ ద్వయాన్ని కలవరపరుస్తాయి.