పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో శనివారం నోటీసులు అందుకున్న సీఏసీ సభ్యురాలు శాంతా రంగస్వామి ఆ పదవికి రాజీనామా చేశారు. భారత క్రికెటర్ల అసోసియేషన్(ఐసీఏ) డైరెక్టర్ పదవి నుంచీ వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. రాజీనామాను బీసీసీఐ పాలక మండలి(సీఓఏ) సీఈఓ రాహుల్ జోహ్రీకి మెయిల్ చేశారు.
"ఏడాదికి ఒకసారో.. రెండు సార్లో సీఏసీ సమావేశం జరుగుతుంది. ఇందులో విరుద్ధ ప్రయోజనాలేంటో నాకైతే అర్థం కావట్లేదు. ఏది ఏమైనా సీఏసీలో సభ్యురాలిగా ఉండడం గౌరవంగా భావిస్తున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పదవికి మాజీ క్రికెటర్లను ఎంపిక చేయడం కష్టం. ఎన్నికలకు ముందే ఐసీఏ పదవికీ రాజీనామా చేస్తున్నా" -శాంతా రంగస్వామి.
ఆగస్టులో టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేసింది కపిల్ నేతృత్వంలోని కమిటీ. ఇందులో సభ్యులుగా ఉన్నవారు విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తారనేది వాదన. ఈ కారణంగానే రంగస్వామితో పాటు కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్‌కు బీసీసీఐ నైతిక విలువల అధికారి డీకే జైన్ శనివారం నోటీసులు పంపారు. అక్టోబర్ 10లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.