నేడు జైపుర్ వేదికగా రాజస్థాన్, పంజాబ్ జట్ల మధ్య ఐపీఎల్లో నాలుగో మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ ఒకసారి కప్పు గెలవగా.. పంజాబ్‌కి ఇంతవరకు టైటిల్ రాలేదు. రెండు జట్లు టైటిల్ కోసం తీవ్రంగా ఆరాటపడుతున్నాయి. ఏడాది నిషేధం తర్వాత పునరాగమనం చేస్తున్న స్టీవ్ స్మిత్‌పైనే అందరి దృష్టి నెలకొంది. మరోవైపు క్రిస్ గేల్, కే ఎల్ రాహుల్ వంటి బ్యాట్స్మెన్లతో పటిష్ఠంగా ఉంది పంజాబ్ జట్టు.
ఏడాది తర్వాత క్రికెట్ ఆడబోతున్న స్టీవ్ స్మిత్ ఐపీఎల్లో సత్తా చాటి ప్రపంచకప్‌పై దృష్టి సారించనున్నాడు. గతేడాది ప్రారంభంలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన స్మిత్ అనంతరం బాల్ ట్యాంపరింగ్ నిషేధానికి గురయ్యాడు. ఇటీవల మోచేతి గాయంతో బాధపడుతున్న స్టీవ్ ఇప్పుడిప్పడే కోలుకుంటున్నాడు. సొంతగడ్డ జైపుర్‌లో మ్యాచ్ జరుగుతుండటం రాయల్స్‌కి కలిసొచ్చే అంశం.
రాజస్థాన్ రాయల్స్
బలాలు:ఐసీసీ విధించిన ఏడాది నిషేధం తర్వాత పునరాగమనం చేస్తున్న స్టీవ్ స్మిత్ ఆ జట్టుకు అదనపు బలం. అజింక్యా రహానే, సంజు శాంసన్, బట్లర్, బెన్ స్టోక్స్ వంటి ఆటగాళ్లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్‌లో క్రిష్ణప్ప గౌతమ్, ఇష్ సోధి, శ్రేయాస్ గోపాల్ లాంటి స్పిన్నర్లున్నారు.
బలహీనతలు:అజింక్యా రహానె ఫామ్ అందుకోవడం ముఖ్యం. ఏడాది కాలంగా టీట్వంటీ క్రికెట్లో స్థిరంగా ఆడట్లేదు. పేస్ విభాగంలో జట్టు కొంచెం బలహీనంగా ఉంది. జోఫ్రా ఆర్చర్ మినహా చెప్పుకోదగ్గ ఫాస్ట్‌బౌలర్ లేడు. గత సీజన్లో ఎక్కువ ధర పెట్టి తీసుకున్న జయదేవ్ ఉనద్కత్ నిరాశపరిచాడు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
2014లో రన్నరప్‌గా నిలిచింది పంజాబ్ జట్టు. తొలి సీజన్లో సెమీస్ వరకు చేరింది. ఈ రెండు సార్లు మినహా ఐపీఎల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ప్రతిసారి కెప్టెన్లను, ఆటగాళ్లను మార్చినా ఫలితం రాలేదు.
బలాలు: అనుభవం గల రవిచంద్రన్ అశ్విన్ జట్టును నడిపించనున్నాడు. గతేడాది కూడా కెప్టెన్‌గా మెప్పించాడీ స్పిన్నర్. అశ్విన్‌తో కలిసి స్పిన్ బౌలింగ్‌లో ముజీబ్ ఉర్ రెహమాన్ కీలక పాత్ర పోషించనున్నాడు. రాహుల్, గేల్, కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్‌లతో బ్యాటింగ్‌లో బలంగా ఉంది. రాహుల్ గత సీజన్లో 659 పరుగులు చేసి ఆకట్టుకోగా, గేల్ 368 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ ఈ జట్టుకు కీలకం కానున్నారు.
బలహీనతలు: మిడిల్ ఆర్డర్లో కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్ ఫామ్ అందుకోవడం అవసరం. స్థిరంగా ఆడటంలో విఫలమవుతుంది పంజాబ్ జట్టు.
రాజస్థాన్ రాయల్స్: అజింక్యా రహానే(కెప్టెన్), స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, జాస్ బట్లర్, టర్నర్, ఇష్ సోధి, థామస్, లివింగ్ స్టోన్, సంజూ శాంసన్, శుభమ్ రంజానే, స్టువర్ట్ బిన్ని, శ్రేయాస్ గోపాల్, సుధేశన్ మిధున్, ఉనద్కత్, ప్రశాంత్ చోప్రా, మహిపాల్ లొమ్రార్, ఆర్యమాన్ బిర్లా, రియాన్ పరాగ్, ధవల్ కులకర్ణి, క్రిష్ణప్ప గౌతమ్, వరుణ్ ఆరోన్, శశాంక్ సింగ్, మనన్ వోహ్రా, రాహుల్ త్రిపాఠి.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్: రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్),డేవిడ్ మిల్లర్, సామ్ కరన్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమి, నికోలస్ పూరన్, మోయిజెస్ హెన్రిక్స్, హర్డస్ విల్జోన్, దర్శన్ నాల్కండే, సర్ఫరాజ్ ఖాన్, ఆర్ష్‌దీప్ సింగ్, అగ్నివేశ్, హర్‌ప్రీత్ బ్రార్, మురుగన్ అశ్విన్, క్రిస్ గేల్, ఆండ్రూ టై, లోకేశ్ రాహుల్, అంకిత్ రాజపుత్, మన్దీప్ సింగ్, సిమ్రాన్ సింగ్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, ముజీబ్ ఉర్ రెహమాన్.