టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ, అతడి మిత్రుడు సురేశ్ రైనా ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఇద్దరూ కలిసి అభిమానులకు వరుస షాకులు ఇచ్చారు. తన నిష్క్రమణ గురించి బీసీసీఐకి రైనా ముందుగా చెప్పలేదని తెలిసింది. ఒకరోజు ఆలస్యంగా తమకు సమాచారం అందించాడని బోర్డు వెల్లడించింది.
బీసీసీఐకి సమాచారం ఇవ్వకుండానే రైనా వీడ్కోలు!
టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అరగంటకే మరో ఆటగాడు రైనా ఆటకు వీడ్కోలు పలికాడు. అయితే రైనా ముందుగా బీసీసీఐకి సమాచారం ఇవ్వకుండానే రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది.
సాధారణంగా ఏ ఆటగాడైన తన వీడ్కోలు సంగతిని బీసీసీఐకి ముందుగానే చెప్పడం ఆనవాయితీ. సురేశ్ రైనా ఇందుకు భిన్నంగా నడుచుకోవడం గమనార్హం. ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం పెట్టిన అరగంటకే రైనా తన రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో ప్రకటించాడు. తన మిత్రుడైన మహీ ఇకపై అంతర్జాతీయ క్రికెట్ ఆడడన్న భావోద్వేగంలో అతడు ఇలా చేసి ఉండొచ్చని బోర్డు అధికారులు భావిస్తున్నారు.
తమకు సమాచారం ఇవ్వకపోవడంతోనే రైనా వీడ్కోలు గురించి బీసీసీఐ వెబ్‌సైట్‌లో శనివారం రాత్రి ప్రకటన ఇవ్వలేదు. అధికారికంగా ఆదివారం సమాచారం రావడం వల్ల ఆ రోజు సాయంత్రం ప్రకటనను విడుదల చేశారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా, కోశాధికారి అరుణ్ ధుమాల్ శుభాకాంక్షలను ప్రకటనలో జతచేశారు.