తెలంగాణ

telangana

ETV Bharat / sports

ద్రవిడ్​కు యువ క్రికెటర్లతో పనిచేయడం అందుకే ఇష్టం! - rahul dravid with young players

'ది వాల్' ఆఫ్‌ ఇండియన్‌ క్రికెట్‌ అంటే​ ఠక్కున గుర్తొచ్చే పేరు రాహుల్‌ ద్రవిడ్. తనదైన ఆటతో ఎన్నో మైలురాళ్లు అందుకున్నారు. ప్రస్తుతం యువ ఆటగాళ్లకు శిక్షణ ఇస్తూ బిజీగా గడిపేస్తున్నారు. స్టార్​ క్రికెటర్​గా ఎంతో పేరు పొందిన ఆయన.. కోచ్​గా కేవలం అండర్​-19, భారత్​-ఏ వరకే ఎందుకు పరిమితమయ్యారో తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు.

Rahul Dravid news
ద్రవిడ్​కు యువ క్రికెటర్లతో పనిచేయడం ఎందుకు ఇష్టమంటే.?

By

Published : May 28, 2020, 5:21 PM IST

ప్రస్తుత లాక్‌డౌన్‌లో అండర్‌-19, బీసీసీఐ కాంట్రాక్టు పొందని ఆటగాళ్ల మానసిక ఆరోగ్య సమస్యలను సంబంధిత నిపుణుల ద్వారా పరిష్కరించామని చెప్పారు జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌ రాహుల్‌ ద్రవిడ్‌. ఈ అంశంపై మాజీ క్రికెటర్లు, కోచ్‌లకు అనుభవం ఉండదని పేర్కొన్నారు. ఈ అనిశ్చిత కాలంలో క్రికెటర్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని రాజస్థాన్‌ రాయల్స్‌ వెబినార్‌లో 'టీమ్‌ఇండియా వాల్‌' వివరించారు.

"ఈ రోజుల్లో యువతరం ఎదుర్కొంటున్న మానసిక సమస్యలను పరిష్కరించే అనుభవం మాజీ క్రికెటర్లు, క్రికెట్‌ కోచ్​లకు ఉంటుందని అనుకోను. సంబంధిత నిపుణులతో వారిని మాట్లాడించడమే మంచిది. ప్రస్తుతం ఒత్తిడితో కూడుకున్న వాతావరణమే ఉంది. గతంలో మానసిక సమస్యలపై ఎవరూ మాట్లాకపోయేవారు. ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగైంది. కొందరైనా బహిరంగంగా చర్చిస్తున్నారు"

-రాహుల్​ ద్రవిడ్​, భారత మాజీ క్రికెటర్​

అందుకే వాళ్లంటే ఇష్టం..

"యువ ఆటగాళ్లు అభద్రతా భావంతో ఉంటారు. అందుకే అండర్‌-19, భారత్‌-ఏ కుర్రాళ్లతో కలిసి పనిచేయడం నాకిష్టం. నేనూ ఆ సమస్యలు ఎదుర్కొనే వచ్చాను. అలాంటి వారిని గుర్తించి నా అనుభవం పంచుకోగలను" అని పేర్కొన్నారు ద్రవిడ్‌. కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆయనకు ఎంబీయే చేస్తుండగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ప్రవేశం దక్కింది. సందిగ్ధ పరిస్థితుల్లో క్రికెట్​కు‌ అంకితమవ్వడం జూదంగా అనిపించిందని వాల్‌ వెల్లడించారు.

"భారత జట్టుకు ఎంపికయ్యేందుకు ప్రయత్నించడం సవాళ్లతో కూడిన దశ. 17 ఏళ్ల వయసులో నేను ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అరంగేట్రం చేశాను. ఐదేళ్ల తర్వాత టీమ్‌ఇండియాకు ఆడాను. ఇప్పుడు ఆలోచిస్తే జాతీయ జట్టుకు ఎంపికయ్యే ముందు వరకు చాలా సంక్లిష్టంగా గడిచిందని అనిపిస్తోంది. ఎందుకంటే భయం, ఆందోళన, అభద్రతాభావం చుట్టూ ఉండేవి. మరొక రంగంలో అవకాశాలు ఉండి క్రికెట్‌కు అంకితమవ్వడం కఠిన నిర్ణయం. క్రికెట్‌తో జూదం ఆడేందుకు చదువును త్యాగం చేయాల్సి వచ్చింది. కానీ అది పనిచేసింది. అదృష్టవశాత్తు నా డిగ్రీని నేనెప్పుడూ ఉపయోగించుకోలేదు"

-రాహుల్​ ద్రవిడ్​, భారత మాజీ క్రికెటర్​

భారత్​ తరఫున 164 టెస్టులు, 344 వన్డేలు, ఓ టీ20 ఆడారు ద్రవిడ్. 2012 మార్చిలో అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికారు. కెరీర్​లో మొత్తం 48 శతకాలు చేశారు.

ఇదీ చూడండి: ద్రవిడ్ మరపురాని ఇన్నింగ్స్​పై ఓ లుక్కేయండి

ABOUT THE AUTHOR

...view details