ఓ దశలో కెప్టెన్సీ ఆస్వాదించలేకపోయానని, అందుకే 2007లో టీమ్ఇండియా నాయకత్వ పగ్గాలు వదిలేశానని భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. గత ప్రదర్శనల గురించి ఆలోచించకుండా కెరీర్లో ముందుకు సాగానని వెల్లడించాడు. ఓ యూట్యూబ్ ఛానెల్లో అతను మాట్లాడుతూ.. "ఇంగ్లాండ్లో జట్టుకు టెస్టు సిరీస్ విజయాన్ని కట్టబెట్టిన తర్వాత కొద్దికాలంలోనే కెప్టెన్సీని ఎందుకు వదిలేశారని" అడిగిన ప్రశ్నకు.. ఈ విధంగా సమాధానమిచ్చాడు.
"అంతకముందులా నాయకత్వాన్ని ఆస్వాదించలేకపోయా. అప్పటికే చాలా మ్యాచ్లాడా కాబట్టి అలా అనిపించిందేమో! ఆ సమయంలో కెప్టెన్సీని ఆస్వాదించడం ఆపేశా. భారత జట్టుకు సారథిగా ఉండటం నా హక్కులా చూడలేదు. ఒకవేళ ఉండాలి అనుకుంటే కచ్చితంగా వందశాతం శ్రమించేవాణ్ని. కానీ ఒక్కసారి వదిలేయాలి అనుకున్న తర్వాత ఇక కొనసాగాలి అనిపించలేదు. టీమ్ఇండియా కెప్టెన్సీ నాకు శక్తిని ఇస్తుందనో లేదంటే ప్రతిష్ఠ తెచ్చిపెడుతుందనో అనుకోలేదు. ఆ భాద్యతను ఆనందంగా చేపట్టా. కానీ ఓ రెండున్నరేళ్ల తర్వాత ఇక చాలు అనిపించింది"
-ద్రవిడ్, టీమ్ఇండియా మాజీ సారథి.