టీమ్‌ఇండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానెను పాలల్లో పడిన ఈగలా తీసిపారేశారని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కెరీర్‌లో మొత్తం 90 వన్డేలాడిన రహానె 35.26 సగటుతో 2962 పరుగులు చేశాడు. అందులో నాలుగో నంబర్ ఆటగాడిగా 27 మ్యాచ్‌ల్లో 843 పరుగులు చేయగా, ఓపెనర్‌గా 54 మ్యాచ్‌ల్లో 1937 పరుగులు సాధించాడు. ఈ గణంకాలే అతడి బ్యాటింగ్ సామర్థ్యాన్ని తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలోనే 2018లో దక్షిణాఫ్రికాతో ఆడాక టీమ్‌ఇండియా అతడిని పక్కనపెట్టింది. ఈ విషయంపై స్పందించిన చోప్రా.. కొన్ని వైఫల్యాలు చూసి అతడిని తీసేయడం సరైన నిర్ణయం కాదన్నాడు. అతడికి మరిన్ని అవకాశాలిచ్చి వేచి చూడాల్సిందని చెప్పాడు.
"నాలుగో స్థానంలో రహానె గణంకాలు బాగున్నాయి. ఆ స్థానంలో నిలకడగా ఆడుతూ 94 స్ట్రైక్‌రేట్ కలిగిన ఆటగాడికి ఎందుకు అవకాశాలు ఇవ్వలేదు? ఉన్నపళంగా అతడిని తొలగించారు. అదెలా ఉందంటే పాలల్లో పడిన ఈగను తీసిపారేసినట్లు వదిలేశారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? అలా చేయడం అతడిపట్ల అమానుషంగా ప్రవర్తించడమేనని నేను అనుకుంటున్నా. ప్రతి మ్యాచ్‌లో 350 పరుగులు సాధించే ఇంగ్లాండ్ జట్టులా టీమ్‌ఇండియా మారి ఉంటే బాగుండేది. వాళ్లు అలాగే ఆడతారు. వాళ్లు మ్యాచ్ గెలిచారా లేదా అని పట్టించుకోరు. అయితే, భారత జట్టును మనం అంతలా తీర్చిదిద్దలేదు. ఇంకా మనం సంప్రదాయమైన ఆటనే ఆడుతున్నాం. 325 పరుగులు చేసే జట్టునే ఎంపిక చేస్తున్నాం."