టీమ్ఇండియా టెస్టు తాత్కాలిక కెప్టెన్ రహానె ప్రశాంత స్వభావం కలిగిన వాడని దిగ్గజ సచిన్ అన్నాడు. తనదైన వ్యూహాలతో భారత జట్టుకు విజయాన్ని అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లీ, రహానె మైదానంలో ప్రవర్తించే తీరు వేరైనా, వారిద్దరి లక్ష్యం మాత్రం గెలుపేనని మాస్టర్ చెప్పాడు.
"రహానె ఇంతకు ముందే టీమ్ఇండియాకు కెప్టెన్‌గా చేశాడు. ప్రశాంతమైన మనస్తత్వం.. అలా అని అతడిలో దూకుడుగా ఆడేతత్వం లేదనుకోకూడదు. ప్రశాంతంగా ఉన్నంత మాత్రాన దూకుడుగా లేనట్లు కాదు. ఉదాహరణకు పుజారాను తీసుకుంటే అతడు మైదానంలో ఏకాగ్రతతో చాలా కూల్‌గా ఆడతాడు. దాని అర్ధం పుజారా మిగిలిన ఆటగాళ్ల కంటే ఎక్కువగా ఆడాలని ప్రయత్నించడకపోవడం కాదు. ప్రతి ఒక్కరూ తమదైన పరిస్థితులను బట్టి స్పందిస్తారు. దారులు వేరైనా.. వారందరి లక్ష్యం టీమ్ఇండియాను గెలిపించడమే. అలానే రహానెలో విభిన్న శైలి ఉంది. ఆటగాళ్లు ఎలా ఆడాలి? పిచ్ స్పందన ఏంటి? బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్లు ఏంటి? అనే విషయాలు మేనేజ్మెంట్ చూసుకుంటుంది"
- సచిన్ తెందుల్కర్, దిగ్గజ క్రికెటర్