దక్షిణాఫ్రికా క్రికెట్(సీఎస్ఏ) వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో పరిమిత ఓవర్ల కెప్టెన్ క్వింటన్ డికాక్.. 'మెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపికయ్యాడు. ఇలా నిలవడం ఇతడికిది రెండోసారి. 2017లో ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు. కరోనా ప్రభావంతో వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 27 ఏళ్ల డికాక్.. 'టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్'గానూ నిలిచాడు.
సఫారీ మహిళా యువ ఓపెనర్ లారా వోల్వార్ట్.. ఈ ఏడాది 'ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' సహా 'వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డులను సొంతం చేసుకుంది. ఈ గౌరవాన్ని దక్కించుకున్న అతి పిన్న వయస్కురాలుగా చరిత్ర సృష్టించింది.