తెలంగాణ

telangana

ETV Bharat / sports

గెలుపుతో సీజన్​ను ముగించిన పంజాబ్ - chennai super kings

చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్​ ఘనవిజయం సాధించింది. 171 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్ల తేడాతో గెలిచింది.

ఐపీఎల్

By

Published : May 5, 2019, 7:40 PM IST

పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉన్న పంజాబ్ చివరి మ్యాచ్​లో మాత్రం రెచ్చిపోయింది. చెన్నైపై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి.. ఈ సీజన్​ను గెలుపుతో ముగించింది.

171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్​కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. గేల్ తనశైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడితే రాహుల్ మాత్రం చెన్నై బౌలర్లకు చెమటలు పట్టించాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కేవలం 19 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. చెన్నైపై అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు వార్నర్ (20 బంతులు ) పేరిట ఉండేది.

వీరిద్దరి ధాటికి పంజాబ్ స్కోర్ కేవలం 9 ఓవర్లలోనే 100కు చేరింది. అనంతరం 108 పరుగుల వద్ద హర్భజన్ వరుస బంతుల్లో రాహుల్ (71, 5 సిక్సులు, 7 ఫోర్లు), గేల్ (28) లను పెవిలియన్ చేర్చాడు. మయాంక్ అగర్వాల్ (7) వెంటనే వెనుదిరిగినా నికోలస్ పూరన్ (36) కాసేపు మెరిశాడు.
చెన్నై బౌలర్లలో హర్భజన్ సింగ్ మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు.

మెరిసిన రైనా, డుప్లెసిస్

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించింది. వాట్సన్ (7) విఫలమైనా.. డుప్లెసిస్, రైనా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ రెండో వికెట్​కు 120 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రైనా (53) అర్ధశతకంతో ఆకట్టుకోగా డుప్లెసిస్ (96, 4 సిక్సులు, 10 ఫోర్లు) కొద్దిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.

పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు తీయగా.. షమీ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.

ఇవీ చూడండి.. రెండో అర్ధభాగం సంతృప్తినిచ్చింది: కోహ్లీ

ABOUT THE AUTHOR

...view details