రాజ్‌కోట్ వేదికగా బంగాల్, సౌరాష్ట్ర జట్ల మధ్య రంజీట్రోఫీ ఫైనల్ జరుగుతోంది. తొలిరోజు బ్యాటింగ్‌లో ఇబ్బంది పడిన సౌరాష్ట్ర, రెండో రోజు పట్టు సాధించింది. ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 384 పరుగులు చేసింది.
మొదటి రోజు అనారోగ్యం కారణంగా మైదానం వీడిన టీమిండియా టెస్టు బ్యాట్స్‌మన్ ఛెతేశ్వర్ పుజారా.. రెండో రోజు బరిలో దిగి 66 పరుగులు సాధించాడు. ఇందుకు 237 బంతులు తీసుకున్నాడు. బంగాల్ బౌలర్ ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు పుజారా.
మరో ఆటగాడు అర్పిత్ శతకంతో అదరగొట్టాడు. 287 బంతులు ఆడి 106 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వీరిద్దరి భాగస్వామ్యం వల్ల జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది.
పిచ్ అస్సలు బాగోలేదు
రాజ్‌కోట్‌లో జరుగుతోన్న రంజీట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో పిచ్ అస్సలు బాగోలేదని బంగాల్ జట్టు కోచ్ అరుణ్ లాల్ ఆరోపించాడు. ఈ విషయాన్ని బీసీసీఐ పరిగణలోకి తీసుకోవాలని సూచించాడు.
అంపైర్‌కు గాయం
సౌరాష్ట్ర, బంగాల్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ షంషుద్దీన్ తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం తొలి రోజు ఆటలో లెగ్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్న సమయంలో.. బెంగాల్ ఫీల్డర్ విసిరిన బంతి నేరుగా వచ్చి అతడి ఉదర భాగంలో బలంగా తాకింది. ఫలితంగా అంపైర్ మైదానంలోనే కుప్పకూలిపోయాడు. అతడి స్థానంలో టీవీ అంపైర్‌గా వ్యవహరిస్తున్న ఎస్ రవి, తొలి రోజు ఆటలో ఫీల్డ్ అంపైర్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. అయితే అదే సమయంలో షంషుద్దీన్ టీవీ అంపైర్‌గా వ్యవహరించాడు.
ఇదీ చూడండి..'ఇదేం పిచ్.. బంతి అస్సలు కదలట్లేదు'