విజయ్ హజారే ట్రోఫీలో ముంబయి కెప్టెన్ పృథ్వీ షా మరో శతకం సాధించాడు. సెమీ ఫైనల్లో కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 79 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు ఈ ఓపెనర్. తాజా సెంచరీతో ఇప్పటివరకు 754 పరుగులు చేసిన పృథ్వీ.. టోర్నీ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
122 బంతులాడిన పృథ్వీ.. 17 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 165 పరుగులు చేశాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్‌కు ముంబయి 49.2 ఓవర్లలో 322 పరుగులు చేసింది. గత మూడు మ్యాచ్‌లుగా ముంబయి జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఈ ఓపెనర్.. ఓ ద్విశతకంతో పాటు రెండు భారీ సెంచరీలు నమోదు చేయడం విశేషం.
లిస్టు-ఏ మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా ఇటీవల రికార్డు నెలకొల్పిన పృథ్వీ.. ధోనీ, కోహ్లీలను అధిగమించాడు. ఇటీవల సౌరాష్ట్రపై కేవలం 123 బంతుల్లోనే 185 పరుగులు చేయడం ద్వారా పృథ్వీ ఈ ఫీట్‌ను సాధించాడు.
2005లో జైపూర్ వేదికగా శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో మహి 183 పరుగులు చేశాడు. ఆసియా కప్‌లో భాగంగా 2012లో పాకిస్థాన్‌పై 183 పరుగులు చేశాడు కోహ్లీ.