టీమ్ఇండియా యువ ఓపెనర్ పృథ్వీషా దేశవాళీ క్రికెట్ ఆడి పరుగులు చేయాలని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్ సూచించాడు. అంతకన్నా ముందు తన బ్యాటింగ్‌లో సాంకేతిక లోపాన్ని సవరించుకోవాలని కోరాడు. ఇందుకోసం ఎవరైనా నిపుణుడు లేదా క్రికెట్ గురువు సలహా తీసుకోవాలని పేర్కొన్నాడు.
అరంగేట్రం చేసిన తొలినాళ్లలో పరుగుల వరద పారించిన పృథ్వీ కొన్నాళ్లుగా భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ అతడిని షార్ట్‌పిచ్ బంతులతో బౌలర్లు పెవిలియన్‌కు పంపించారు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీసులోనైతే ఇన్‌స్వింగర్లతో బోల్తా కొట్టించారు. పిచ్ అయిన బంతి ఆఫ్ వికెట్‌మీదకు దూసుకొస్తున్నప్పుడు ఆడటంతో షా విఫలమవుతున్నాడు. బ్యాటు, ప్యాడ్ల మధ్య నుంచి వెళ్లిన బంతి వికెట్లను గిరాటేస్తోంది. దాంతో అతడి స్థానంలో శుభ్‌మన్‌గిల్‌కు జట్టు యాజమాన్యం అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.