గత ఏడాది సౌరభ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కాబోతున్నట్లు ముందుగా వార్తలొచ్చినప్పుడు వాటిని ఊహాగానాల్లాగే చూశారందరూ! కానీ కొన్ని రోజుల్లోనే వేగంగా పరిణామాలు మారిపోయాయి. అనూహ్యంగా గంగూలీ బీసీసీఐ సింహాసనంపై కూర్చునేశాడు.
ఇప్పుడు అనుకోకుండా సౌరభ్ ఐసీసీ ఛైర్మన్ పదవి చేపట్టడంపై చిన్న చర్చ మొదలైంది. ఇది చూస్తుండగానే విస్తృతమైంది. ఉన్నట్లుండి దాదా.. ఐసీసీ పెద్ద పదవికి ఫేవరెట్‌గా మారిపోయాడు. బీసీసీఐ బాస్ అయిన తరహాలోనే అతను త్వరలోనే ఐసీసీ ఛైర్మన్ పదవి చేపడితే ఆశ్చర్యమేమీ లేదు!
భారత్‌లో క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా కొనసాగుతున్న టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ.. అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) ఛైర్మన్ పదవికి అనూహ్యంగా రేసులోకి వచ్చాడు. అతణ్ని ఆ పదవిలో కూర్చోబెట్టడానికి మెజారిటీ క్రికెట్ దేశాల బోర్డులు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికా క్రికెట్ డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ ఇప్పటికే దాదాకు తన మద్దతు ప్రకటించాడు. బీసీసీఐతో ఉన్న విభేదాల దృష్ట్యా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), తమ ఛైర్మన్ కొలిన్ గ్రేవ్స్ ఐసీసీ పదవిని ఆశిస్తున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మాత్రమే గంగూలీని వ్యతిరేకించేందుకు ఆస్కారముంది. మిగతా బోర్డులకు దాదా విషయంలో ఏ అభ్యంతరం ఉండకపోవచ్చు. నాలుగేళ్లుగా ఐసీసీ ఛైర్మన్ పదవిలో ఉన్న శశాంక్ మనోహర్ పదవీకాలం జులైలో జరగబోయే ఐసీసీ వార్షిక సమావేశంతో ముగియబోతుండగా.. అందులోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.
మద్దతు ఎందుకిస్తాయంటే..
కరోనా ధాటికి రెండు నెలలుగా క్రికెట్ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. రాబోయే కొన్ని నెలల్లోనూ సిరీస్‌లు, టోర్నీలకు అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మినహాయిస్తే అన్ని దేశాల క్రికెట్ బోర్డులూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్న క్రికెట్ ఆస్ట్రేలియా కష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి బోర్డూ భారత్‌తో సిరీస్ కోసం ఎదురు చూస్తోంది. భారత్‌తో సిరీస్ అంటే వందల కోట్ల ఆదాయం వస్తుంది. ఈ నేపథ్యంలో గంగూలీ అభ్యరిత్వానికి పచ్చజెండా ఊపితే బీసీసీఐ కరుణ తమపై ఉంటుందని భావిస్తున్నాయి. అలాగే ప్రపంచ క్రికెట్ సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో ఐసీసీకి దాదా లాంటి సమర్థుడి అవసరం ఉందని అంటున్నారు. ఇంతకుముందు గంగూలీ గురువు జగ్‌మోహన్ దాల్మియా ఇలాగే ఐసీసీ పదవిని చేపట్టి దాని రూపురేఖలు మార్చేశాడు. ఆదాయాన్ని పెంచాడు. ఇప్పుడు ఆయన శిష్యుడు ఐసీసీ ఛైర్మన్ పదవిని చేపట్టి కష్టాల్లో ఉన్న ప్రపంచ క్రికెట్‌ను ఆదుకుంటాడని బోర్డులు ఆశిస్తున్నాయి.