ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. భారత్‌కు చెందిన ప్రముఖ క్రికెటర్లు, క్రీడాకారులతో, శుక్రవారం వీడియో కాల్లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. 49 మంది ఉన్న ఈ జాబితాలో కెప్టెన్ కోహ్లీ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, కేంద్రమంత్రి కిరణ్ రిజుజు తదితరులు ఉన్నారు.
"లాక్‌డౌన్ సమయంలో ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేయాలి. వారిలో ధైర్యాన్ని పెంచుతూ, సామాజిక దూరం పాటించాలని కోరాలి. ప్రస్తుతం మీరు ప్రజలకు ఇచ్చే సందేశాలు ఎంతో కీలకం. క్రీడా శిక్షణలో మీరు నేర్చుకున్న స్వీయ క్రమశిక్షణ, సానుకూలత, ఆత్మవిశ్వాసం, సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం.. వైరస్ వ్యాప్తిని కట్టడిచేయడానికి ఉపయోగించాలి. మైదానాంలో పోరాడిన తీరుతోనే మహమ్మారిని ఎదుర్కోవాలి" అని క్రీడాకారులతో మోదీ అన్నారు.
"ప్రజలకు మీరిచ్చే సందేశాల్లో ఈ ఐదు అంశాలను చేర్చాలి. మహమ్మారిపై పోరాడాలనే 'సంకల్పం', సామాజిక దూరాన్ని అనుసరించాలనే 'నిగ్రహం', సానుకూలత ధోరణిలో ఉండాలనే 'అనుకూలత', కరోనాపై చేస్తున్న యుద్ధంలో ముందుండి పోరాడుతున్న వైద్య, పోలీసు సిబ్బంది..మొదలైన వారిపై 'గౌరవం', పీఎం-కేర్స్‌కు తమ వంతు సాయం చేసేలా 'సహకారం' అనే అంశాలు ఉండాలి. ఆయుష్ మంత్రిత్వ శాఖ జారీచేసిన మార్గదర్శకాలను పాటించేలా ప్రజలకు సూచించాలి" అని ప్రధాని వెల్లడించారు.