ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ (కొవిడ్-19) భారత్‌లోనూ వ్యాపిస్తుండటం వల్ల ఐపీఎల్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ టోర్నీ నిర్వహించొద్దని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 29 నుంచి మొదలవనున్న ఐపీఎల్ 13వ సీజన్‌ను నిర్వహించేందుకు బీసీసీఐకి, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వొద్దని కోరుతూ మద్రాసు హైకోర్టులో న్యాయవాది జి అలెక్స్ బెంజిగర్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ ఎంఎం సుంద్రేశ్, కృష్ణన్ రామస్వామి డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.
ఐపీఎల్ ఆపాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్
కరోనా ప్రభావం ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఐపీఎల్ నిర్వహించకూడదని మద్రాసు హైకోర్టులో ఓ లాయర్ పిటిషన్ వేశారు.
"ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్‌లో కొవిడ్-19 మందును ఇంకా కనుగొన్నట్లు నమోదు కాలేదు" అని పిటిషన్‌లో అలెక్స్ చెప్పారు. కరోనా వైరస్ ప్రపంచమంతా అంటువ్యాధిలా వేగంగా వ్యాపిస్తుందని ఆయన పేర్కొన్నారు. కరోనా ప్రభావంతో ప్రతిష్ఠాత్మక లీగ్ అయిన ఇటలీ ఫెడరేషన్ లీగ్‌నూ ఆ దేశ ప్రభుత్వం మైదానంలోకి అభిమానులను అనుమతించకుండా నిర్వహిస్తుందని అన్నారు. ఐపీఎల్‌ను నిర్వహించడానికి బీసీసీఐకి అనుమతించవద్దని ప్రతిపాదించినా, అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని పిటిషన్ లో పేర్కొన్నారు.
కరోనా వైరస్ భయంతో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచీ వ్యతిరేకత పెరుగుతున్న సంగతి తెలిసిందే. లీగ్‌ను వాయిదా వేయాలని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపె బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం.. టోర్నీ నిర్వహణకు వ్యతిరేకంగా ఉందని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఈనెల 29న తలపడనుంది.