తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రెండో రోజు కరోనా సోకితే ఏం చేస్తారు?' - రాహుల్ ద్రవిడ్ తాజా వార్తలు

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిర్వహించబోయే బయో బబుల్ విధానం సరైనది కాదని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్. ఇలా చేయడం అన్ని బోర్డులకు సాధ్యం కాకపోవచ్చని అన్నాడు.

'రెండో రోజు కరోనా సోకితే ఏం చేస్తారు?'
రాహుల్ ద్రవిడ్

By

Published : May 27, 2020, 7:52 AM IST

బయో సెక్యూర్‌ వాతావరణంలో క్రికెట్‌ను పునరుద్ధరించడం ఆచరణ సాధ్యం కాకపోవచ్చని టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. పాకిస్థాన్‌, వెస్టిండీస్‌లకు ఆతిథ్యమివ్వబోయే సిరీస్‌లను ఈ విధానంలో నిర్వహిస్తామని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించిన నేపథ్యంలో ద్రవిడ్‌ ఈ విధంగా స్పందించాడు.

ఆటగాళ్లను బయటి ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉంచి, పూర్తిగా సురక్షిత వాతావరణంలో క్రికెట్‌ మ్యాచ్‌లను నిర్వహించడమే ఈ బయో సెక్యూర్‌ లేదా బయో బబుల్‌ విధానం. ఇంగ్లాండ్‌ బోర్డు ప్రణాళిక ప్రకారం జులై నుంచి ఆగస్టు వరకు జరిగే సిరీస్‌ల కోసం ఆ దేశ ఆటగాళ్లు జూన్‌ 23నే ఏగియాస్‌ బౌల్‌ మైదానానికి చేరుకోవాలి. తొమ్మిది వారాల పాటు ఆటగాళ్లు తమ కుటుంబాలకు, మిగతా ప్రపంచానికి భౌతికంగా దూరంగా ఉండాలి. దీనిపై ద్రవిడ్‌ స్పందిస్తూ.. "బయో బబుల్‌లో ఉన్న వారికి పరీక్షలు చేస్తారు, క్వారంటైన్‌లో పెడతారు సరే.. కానీ టెస్టు మ్యాచ్‌ రెండో రోజు ఓ ఆటగాడికి కరోనా సోకినట్లు తేలితే ఏం చేస్తారు? నిబంధనల ప్రకారమైతే ఆరోగ్య శాఖ అధికారులు వచ్చి అందరినీ క్వారంటైన్‌లో పెడతారు" అని ఓ ఆన్‌లైన్‌ చర్చ సందర్భంగా చెప్పాడు.

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్

"ఒకవేళ ఇంగ్లాండ్‌ బోర్డు బబుల్‌ను సృష్టించి మ్యాచ్‌లను నిర్వహించినా.. మ్యాచ్‌ల కాలెండర్‌, ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే అన్ని బోర్డులకు అలా చేయడం సాధ్యం కాదు" అని రాహుల్ అన్నాడు.

ఆగస్టులో భారత్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఆతిథ్యమివ్వాలనుకుంటున్న క్రికెట్‌ దక్షిణాఫ్రికా కూడా.. బయో బబుల్‌ విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ విధానంలో క్రికెట్‌ జరిగే మ్యాచ్‌ వేదిక, దానికి అతి సమీపంలో సుమారు 350 మందికి బస కల్పించే సౌకర్యాలు ఉండాలి. మైదాన పరిసరాలను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలి. ఈ బయో బబుల్‌లో ఉండే వారికి తరచుగా పరీక్షలు నిర్వహిస్తారు.

ABOUT THE AUTHOR

...view details