దిగ్గజ సచిన్ తెందూల్కర్ దాదాపు 24 ఏళ్ల పాటు టీమ్ఇండియాకు ప్రాతనిధ్యం వహించాడు. (1989-2013) నాలుగు దశాబ్దాలను కవర్ చేశాడు. అయితే సచిన్ కెరీర్ కొనసాగుతున్నప్పుడే ఎందరో క్రికెటర్లు ఎంట్రీ ఇచ్చి, రిటైర్మెంట్ తీసేసుకున్నారు. ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లు మాత్రం మాస్టర్ బ్లాస్టర్‌తో తమ తొలి, చివరి మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్నారు. అలాంటి నలుగురు ఆటగాళ్ల గురించిన విశేషాలు మీకోసం.
సౌరభ్ గంగూలీ-వన్డే క్రికెట్
1992లో వన్డేల్లో అరంగేట్రం చేసిన గంగూలీ.. వెస్టిండీస్‌తో బ్రిస్బేన్ వేదికగా జరిగిన మ్యాచ్‌తో టీమ్ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్‌లో ఆరోస్థానంలో దిగి కేవలం 3 పరుగులు చేశాడు. ఆ సమయంలో సచిన్ అవతలి ఎండ్‌లో ఉన్నాడు.
సౌరభ్ గంగూలీతో సచిన్ తెందుల్కర్ 2008లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో చివరగా ఆడాడు గంగూలీ. ఇందులోని ఆఖరి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగులు చేసిన దాదా.. జట్టు 86 పరుగుల ఆధిక్యంలో నిలిచేందుకు సాయం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి సచిన్.. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నాడు. వన్డేల్లోనూ గంగూలీ చివర వన్డే(2007) భాగస్వామి సచిన్ కావడం విశేషం.
సుజిత్ సోమసుందర్-వన్డే క్రికెట్
కర్ణాటకు చెందిన సుజిత్ సోమసుందర్.. స్వదేశంలో 1996లో జరిగిన టైటాన్ కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు వన్డేల్లోనూ సచిన్‌తో కలిసి బ్యాటింగ్ చేసే అదృష్టాన్ని దక్కించుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌ల్లో తక్కువ పరుగులే చేయడం వల్ల సోమసుందర్ అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగించలేకపోయాడు. తద్వారా తన తొలి, చివరి వన్డేల్లో సచిన్‌తో మాత్రమే బ్యాటింగ్ చేసిన అనుభవాన్ని మిగుల్చుకున్నాడు.
విజయ్ దహియా-టెస్టు క్రికెట్
2000-01 సీజన్లో భారత్ తరఫున ఆడిన విజయ్ దహియా.. ఈ సమయంలో 19 వన్డేలు, 2 టెస్టుల్లో పాల్గొన్నాడు. ఈ రెండు టెస్టులు స్వదేశంలో జింబాబ్వేతో జరిగాయి. తొలి మ్యాచ్‌లో తనకు బ్యాటింగ్ అవకాశం రాకుండానే టీమ్ఇండియా గెలిచేసింది. రెండో మ్యాచ్‌లో జట్టు స్కోరు 601/6 ఉండగా, దహియా క్రీజులోకి వచ్చాడు. అవతలి ఎండ్‌లో సచిన్ 195 పరుగులతో ఉన్నాడు.
అయితే ఇతడు ఐదు బంతులు మాత్రమే ఎదుర్కొని, రెండు సింగిల్స్ తీశాడు. ఆ తర్వాత సచిన్ ద్విశతకం చేయగానే జట్టు డిక్లేర్ ప్రకటించింది. దీంతో తన టెస్టు కెరీర్లో సచిన్‌తో మాత్రమే బ్యాటింగ్ చేసిన ఘనత సాధించాడు దహియా.
సుబ్రతో బెనర్జీ-టెస్టు క్రికెట్
ఈ బెంగాలీ పేసర్.. కేవలం ఏడాదే(1991-92) అంతర్జాతీయ కెరీర్ కొనసాగించాడు. భారత్ తరఫున ఆరు వన్డేలు, ఓ టెస్టులో పాల్గొన్నాడు. 1992లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో 313 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది ఆసీస్. ఛేదనలో రవిశాస్త్రి ద్విశతకం, సచిన్ సెంచరీతో రాణించారు. పదో స్థానంలో వచ్చిన బెనర్జీ.. సచిన్‌తో కలిసి బ్యాటింగ్ చేసి, 16 పరుగులు సాధించాడు. తద్వారా సచిన్‌తో తన తొలి, ఏకైక టెస్టు ఆడిన ఘనత సంపాదించాడు.