న్యూజిలాండ్‌లో వచ్చే నెలలో జరిగే టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించగానే అందరి దృష్టి తన్వీర్ వైపే మళ్లింది. ఎవరా ఆటగాడు? అతని ప్రస్థానం ఏమిటీ? అనే ప్రశ్నలు రేకెత్తాయి. జలంధర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే రహీంపూర్ కాలా సంఘియాన్కు చెందిన జోగా 1997లో సిడ్నీకి వలస వెళ్లాడు. అతని కొడుకే ఈ తన్వీర్.
అక్కడ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేసే అతను.. పదేళ్ల వయసులో తన కొడుకును అక్కడి ఓ క్రికెట్ క్లబ్లో చేర్పించాడు. అయితే తన్వీర్‌కు ఆ ఆట మీద ఇష్టం అనుకోకుండా ఏర్పడింది. స్థానిక గురుద్వారాలో వాలీబాల్ సెషన్ల విరామ సమయంలో క్రికెట్ ఆడేవాడు. వేసవి సెలవుల్లో భారత్‌లోని తన గ్రామానికి వచ్చినప్పుడు.. ఇక్కడ క్రికెట్లో నేర్చుకున్న టెక్నిక్లను తిరిగి ఆస్ట్రేలియా వెళ్లాక అమలుపరిచేవాడు. అలా మొదలైన తన క్రికెట్ ప్రస్థానం ఘనంగా సాగుతోంది. పాఠశాల స్థాయిలో, వివిధ వయసు విభాగాల్లో ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
గతేడాది అండర్-19 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తరఫున విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. బిగ్‌బాష్ లీగ్‌లో అరంగ్రేటం చేసి సిడ్నీ థండర్స్ తరఫున ఆడిన అతను.. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు (21 వికెట్లు) తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఇప్పటికే ఉత్తమ స్పిన్నర్లుగా పేరు తెచ్చుకున్న రషీద్‌ఖాన్, ఆడమ్ జంపాలను అతను వెనక్కు నెట్టడం విశేషం.