ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు తరఫున ఆడితే తనను చంపేస్తామని బెదిరించేవాళ్లని ఆ దేశ మాజీ ఆల్రౌండర్ ఫిలిప్ డిఫ్రీటస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనపై గతంలో జాతివివక్ష చూపారని తెలిపాడు.
"నన్ను దూషిస్తూ నేషనల్ ఫ్రంట్ లేఖలు పంపేది. ఒక్కసారి కాదు రెండుమూడు సార్లు అలా జరిగింది. 'నువ్వు ఇంగ్లాండ్కు ఆడితే కాల్చేస్తాం' అని ఓ లేఖలో రాసి పంపారు. దీంతో నా ఇంటికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరా. కారుపై నా పేరునూ తొలగించాల్సి వచ్చింది. లార్డ్స్ టెస్టుకు రెండు రోజులు ముందు మ్యాచ్లో ఆడాలా వద్దా అని ఆలోచించా. ఒకవేళ ఆడితే నాపై తుపాకీతో దాడి చేస్తారా? అని అనుకునేవాణ్ణి. నాకు ఎవరి నుంచి మద్దతు లభించలేదు. నా సమస్యను నేనే ఎదుర్కొన్నా"
-ఫిలిప్ డిఫ్రీటస్, ఇంగ్లాండ్ మాజీ ఆల్రౌండర్.
నల్ల జాతీయుడైన ఫిలిప్.. ఇంగ్లాండ్ తరఫున 1986-1997మధ్య కాలంలో 44 టెస్టులు, 103 వన్డేలు ఆడాడు. ఆఫ్రో-అమెరికన్ ఫ్లాయిడ్ మృతితో ప్రపంచవ్యాప్తంగా జాతి వివక్షకు వ్యతిరేకంగా నిరసనలు రేకేత్తిన నేపథ్యంలో ఫిలిప్ ఈ వ్యాఖ్యలు చేశాడు.