లద్దాఖ్ ఘర్షణల నేపథ్యంలో ప్రజలు చైనా వస్తువులను బహిష్కరిస్తుంటే.. ఐపీఎల్‌కు మాత్రం చైనా స్పాన్సర్‌ను కొనసాగించటంపై జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.
"చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రజలకు చెప్తూ.. చైనాకు చెందిన సెల్‌ఫోన్ ఉత్పత్తిదారులను ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా కొనసాగిస్తున్నారు. చైనాను ఎలా నియంత్రించాలో అని మనం అయోమయంలో ఉంటే... ఆ దేశం మనను అపహాస్యం చేయడంలో ఆశ్చర్యం లేదు" అని ఒమర్ ట్విటర్ వేదికగా విమర్శించారు.
ఐపీఎల్ ప్రస్తుత సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు నిర్వహించనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఈ మ్యాచ్‌లు దుబాయ్, అబుదాబీ, షార్జాలోని మైదానాల్లో జరగనున్నాయి. అయితే లీగ్ స్పాన్సర్స్‌లో ఏ మార్పూ లేదని, చైనా కంపెనీల స్పాన్సర్‌షిప్‌నే కొనసాగించాలని పాలక మండలి ఆదివారం నిర్ణయించింది.
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ వివో ఏడాదికి రూ.440 కోట్లు బీసీసీఐకి చెల్లిస్తోంది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఇంత తక్కువ సమయంలో మరో కొత్త స్పాన్సర్ లభ్యం కావడం ఇంచుమించు అసాధ్యమని బోర్డు అభిప్రాయపడింది.
చైనా స్పాన్సర్లను బీసీసీఐ అంగీకరించటం పట్ల ఒమర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా చైనాలో తయారైన టీవీలను తమ ఇళ్లల్లోంచి బయటకు విసిరేసిన బుద్ధిహీనుల పట్ల తనకు జాలిగా ఉందని ఆయన అన్నారు.