భారత్ రాతపూర్వక హామీ ఇవ్వకుంటే టీ20 ప్రపంచకప్ వేదికను యూఏఈకి మార్చాలని ఒత్తిడి చేస్తామని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎహ్‌సన్ మణి అన్నారు. జట్టుకు మాత్రమే కాకుండా అభిమానులు, విలేకరులకు వీసాల మంజూరుపై హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ అభిప్రాయాలను ఇప్పటికే ఐసీసీకి తెలియజేశామని వివరించారు. 'బిగ్ త్రి' వైఖరి మారాల్సి ఉందన్నారు.
"జాతీయ జట్టుకు వీసాలపై మాత్రమే రాతపూర్వక హామీ అడగడం లేదు. అభిమానులు, అధికారులు, విలేకరులకూ ఇవ్వాలని కోరుతున్నాం. మార్చి చివరికల్లా భారత్ మాకు హామీ ఇవ్వాలని ఐసీసీకి చెప్పాం. లేదంటే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను భారత్ నుంచి యూఏఈకి మార్చాలని డిమాండ్ చేశాం"
-మణి, పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్
అక్టోబర్-నవంబర్‌లో భారత్ వేదికగా ప్రపంచకప్ జరుగనుంది. పాకిస్థాన్ బృందం మొత్తానికి భద్రతా ఏర్పాట్లపై బీసీసీఐని హామీ అడిగామని మణి పేర్కొన్నారు. తమ రెండు దేశాల మధ్య క్రికెట్ జరగడం లేదు కాబట్టి భారత్ లేకుండానే క్రికెట్ నిర్వహించేందుకు పీసీబీ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు.
మార్చి చివరికల్లా తమ క్రికెటర్లకు కరోనా వ్యాక్సినేషన్ పూర్తవుతుందని మణి ధీమా వ్యక్తం చేశారు. పాక్‌కు తిరిగి క్రికెట్ తీసుకురావడానికి ఎంతో కృషి చేశామని అన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనకు ఆస్ట్రేలియా నిరాకరించడం నిరాశపరిచిందని పేర్కొన్నారు. కొవిడ్-19 విపరీతంగా ఉన్న దశలో ఇంగ్లాండ్‌లో పర్యటించేందుకు పాక్ జట్టును పంపించామని గుర్తు చేశారు. ఆసియా కప్ నిర్వహించేందుకు శ్రీలంక బోర్డు విండో సృష్టించిందని వెల్లడించారు.
ఇదీ చదవండి:'కోహ్లీతో కలిసి ఆడేందుకు వేచి చూస్తున్నా'